భావి నాయకుల కార్ఖానా.. భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
పార్టీ కార్యకర్తలకు సమగ్ర శిక్షణా కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దుతారు. దేశంలోని ఏ ప్రాంతం వారు వచ్చినా సమస్త సమాచారం లభించేలా, పార్టీ కార్యకర్తలకు సమగ్రమైన శిక్షణ లభించేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు.
భారత్ రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తల కోసం శిక్షణా తరగతులు, సమావేశాలు నిర్వహించేందుకు, సమగ్ర సమాచారాన్ని చిటికెలో తెలుసుకునేందుకు మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీకి లేని విధంగా దీన్ని అత్యాధునిక హంగులతో రూపొందిస్తున్నారు. దీనిపేరు భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ కేంద్రం. హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో ఈ భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో ఈ భవనం నిర్మిస్తున్నారు. ఈరోజు భూమిపూజతోపాటు, చండీహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయన వెంట ఉన్నారు.
బీఆర్ఎస్ కు తెలంగాణ వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలున్నాయి. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కూడా ఆఫీస్ ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆదివారం నిర్మల్ బీఆర్ఎస్ ఆఫీస్ కి శంకుస్థాపన చేశారు సీఎం కేసీఆర్. ఆమధ్య ఢిల్లీలో కేంద్ర కార్యాలయం కూడా ప్రారంభించుకున్నారు. ఇప్పుడు వివిధ అవసరాల నిమిత్తం భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
పార్టీ కార్యకర్తలకు సమగ్ర శిక్షణా కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దుతారు. దేశంలోని ఏ ప్రాంతం వారు వచ్చినా సమస్త సమాచారం లభించేలా, పార్టీ కార్యకర్తలకు సమగ్రమైన శిక్షణ లభించేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు. పెద్ద పెద్ద సమావేశ మందిరాలు, అత్యాధునికమైన డిజిటల్ లైబ్రరీ, వివిధ భాషా పత్రికలు, వాటిలో వచ్చే వార్తల సమాచారాన్ని క్రోడీకరించడం, పార్టీ నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించడం ఇక్కడినుంచే జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన తరగతి గదులు, సమావేశ మందిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ శిక్షకులకు ఇక్కడే వసతి ఏర్పాట్లు కూడా చేస్తారు. రిటైర్డ్ అధికారులు, న్యాయనిపుణులు, రాజకీయ రంగంపై అవగాహన ఉన్నవారిని సమన్వయకర్తలు, శిక్షకులు, సబ్జెక్ట్ నిపుణులుగా నియమిస్తారని తెలుస్తోంది. ఈ కేంద్రం అందుబాటులోకి వస్తే పార్టీ కార్యక్రమాలకు మరింత విలువ జోడించినట్టవుతుందని అంటున్నారు.