సీఎం సొంత జిల్లాలోనే గెలిచాం.. మార్పు మొదలైంది

అధికార పార్టీ ప్రలోభాలకు నిలువునా పాతరేసిన ఎన్నిక ఇదని అన్నారు కేటీఆర్.

Advertisement
Update:2024-06-02 11:37 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కి ఊరటనిచ్చే గెలుపు ఇది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ గడ్డపై గులాబీ జెండా ఎగిరిందన్నారు. సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు, తెలంగాణలో రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు అని అన్నారాయన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ విజయం కోసం పని చేసిన ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తమపై మరింత బాధ్యత పెంచిందని చెప్పారు కేటీఆర్. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ అద్భుత గెలుపు హర్షణీయం అన్నారు కేటీఆర్.

అధికార పార్టీ ప్రలోభాలకు నిలువునా పాతరేసిన ఎన్నిక ఇదని అన్నారు కేటీఆర్. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి, కాంగ్రెస్ పార్టీ తమవైపు తిప్పుకోవాలనుకుందని, కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆ ప్రలోభాలకు లొంగలేదని చెప్పారు. ఆరునెలల్లోనే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిన ఫలితమిదని అన్నారు. నాడైనా.. ఏనాడైనా తెలంగాణ ఇంటిపార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, బీఆర్ఎస్ ఈ గడ్డకు శ్రీరామరక్ష అని మరోసారి తేల్చిచెప్పిన శుభతరుణమిదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 

Tags:    
Advertisement

Similar News