మోడీ జీ థాంక్యూ - కేటీఆర్
2023 జూన్ 28న పీవీ జయంతి రోజు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేసిన ట్వీట్‌ను మరోసారి గుర్తు చేసుకున్నారు కేటీఆర్.
మాజీ ప్రధాని పీవీ.నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పీవీకి భారతరత్న ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్. కేసీఆర్ ప్రభుత్వంలో పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలు నిర్వహించిన నాటి నుంచే ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
2023 జూన్ 28న పీవీ జయంతి రోజు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేసిన ట్వీట్‌ను మరోసారి గుర్తు చేసుకున్నారు కేటీఆర్. ఆ ట్వీట్‌లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యంత ప్రభావవంతమైన, సమర్థవంతమైన ప్రధానమంత్రుల్లో పీవీ ఒకరన్నారు కేటీఆర్. ఇదే విషయాన్ని తాను గతంలోనూ చెప్పానన్నారు. భారతరత్నకు పీవీ నిజమైన అర్హుడన్నారు.
ఈ దేశ ప్రధానుల్లో అత్యంత తక్కువగా అంచనా వేసిన, అణగదొక్కబడిన ప్రధానుల్లో పీవీ ఒకరన్నారు కేటీఆర్. మీడియాతో పాటు సొంత పార్టీ కాంగ్రెస్ పీవీని జీవించి ఉన్నప్పుడు, మరణించిన తర్వాత కూడా అవమానించిందన్నారు. ఇది విచారకరమైనప్పటికీ..కఠిన నిజం అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.