దక్షిణాదిలో పార్లమెంటరీ సీట్లు తగ్గే అవకాశం...ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే అన్న కేటీఆర్
2026 లో జరిగే డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటరీ సీట్లు తగ్గించే అవకాశం ఉన్నదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. అదే గనక జరిగితే న్యాయాన్ని అపహాస్యం చేసినట్టే అవుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఉత్తర భారత దేశంలో పార్లమెంటరీ సీట్లు పెరిగి, దక్షిణాదిలో తగ్గే అవకాశం కనబడుతోంది. జనాభా నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో 1951 నుంచి ఇప్పటికి 6.4 శాతం జనాభా తగ్గింది. 1951లో 26.2 శాతం జనాభా ఉంటే.. 2022 నాటికి 19.8 శాతానికి చేరింది. అదే ఉత్తర భారతంలో జనాభా 4.1 శాతం పెరిగింది. 1951లో ఉత్తరాదిలో 39.1 శాతం ఉండగా, 2022 కు 43.2 శాతానికి జనాభా చేరింది.
ఈ కారణంగా 2026 లో జరిగే డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్ల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒక వేళ అదే కనుక జరిగితే.. న్యాయాన్ని అపహాస్యం చేసినట్టే అవుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ డీలిమిటేషన్ ప్రక్రియ భారత ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించనున్నదని పలువురు నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.