కోమటిరెడ్డి కొత్త బాంబు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..!

33 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న తాను, పీసీసీ అధ్యక్ష పదవి రానంత మాత్రాన పార్టీ మారతానా? అని ప్రశ్నించారు కోమటిరెడ్డి. రాష్ట్రంలో తన పాదయాత్ర ఉండదని తేల్చి చెప్పారు.

Advertisement
Update:2023-04-14 18:50 IST

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం సీటుకి పోటీపడేవారు చాలామందే ఉంటారు. తనకు ఆ అవకాశం రాకపోయినా పర్లేదు, తన రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం అలాంటి ఛాన్స్ రానివ్వను అంటూ కొత్త ఫిటింగ్ పెట్టారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అప్పుడే అసలైన సామాజిక న్యాయం జరిగినట్టు అని చెప్పారు. దళితబంధుపై విమర్శలు చేసే క్రమంలో.. సీఎం సీటుని దళితులకు రిజర్వ్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. దళిత నాయకుడు ఖర్గేను తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, కాంగ్రెస్‌లో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని తాను ఖర్గేని కోరతానన్నారు కోమటిరెడ్డి.

తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శత విధాల ప్రయత్నిస్తున్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. పాదయాత్రలతో పార్టీకి పూర్వ వైభవం తెస్తానంటున్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు అంత తేలిగ్గా సమసిపోయేలా లేవు. కోమటిరెడ్డి అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలతో బాంబులు పేలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన చేసిన దళిత సీఎం వ్యాఖ్యలు కూడా తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశమయ్యాయి. రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే కోమటిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

తెలంగాణలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన దళితులకు అండగా నిలబడినట్టు కాదని, దళిత బంధు దోపిడీ పథకంగా మారిందని విమర్శించారు కోమటిరెడ్డి. పార్టీ నుంచి మహేశ్వర్‌ రెడ్డి వెళ్లినా ఎలాంటి నష్టం లేదన్నారు. తాను కూడా పార్టీ వీడుతున్నట్టు ఎన్నోసార్లు ప్రచారం జరిగిందని, అయినా తాను పార్టీ మారలేదన్నారు. గిట్టనివాళ్లు దుష్ప్రచారం చేస్తుంటారని అన్నారు. 33 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్న తాను, పీసీసీ అధ్యక్ష పదవి రానంత మాత్రాన పార్టీ మారతానా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో తన పాదయాత్ర ఉండదని తేల్చి చెప్పారు. భట్టి విక్రమార్క పాదయాత్రనే తన పాదయాత్ర అన్నారు కోమటిరెడ్డి.

Tags:    
Advertisement

Similar News