కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నయా ట్విస్ట్.. దీని అర్థం ఏంటి ?

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేయడం, బీజేపీ లో చేరడం విషయంపై రోజుకో మాట మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులనే కాక కార్యకర్తలను కూడా అయోమయానికి గురి చేస్తున్నారు.

Advertisement
Update:2022-07-24 13:17 IST

కాంగ్రెస్ లో కోమటి రెడ్డి బ్రదర్స్ తీరే వేరు అందులోనూ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు కాంగ్రెస్ ను ముప్పుతిప్పలు పెడుతున్నది. కాంగ్రెస్ ను బహిరంగాంగా తిడతాడు.... బీజేపీనే టీఆరెస్ ను ఓడించగలదని ప్రకటిస్తాడు.... బీజేపీలో చేరతున్నానని కార్యకర్తలకు చెప్తాడు.... మళ్ళీ వెంటనే కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని నేనెప్పుడు చెప్పాను ? అని తానే ప్రశ్నిస్తాడు.  కొద్ది రోజులు కామ్ గా ఉండి మళ్ళీ అదే వరస క్రమం మొదలుపెడతాడు.

ఇప్పుడు మళ్ళీ అదే జరిగింది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న రాజగోపాల్ రెడ్డి మొన్న బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు. ఇక కొద్ది రోజుల్లో బీజేపీలో చేరుతున్నట్టు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇక రేపో మాపో బీజేపీలో చేరడమే తరవాయి అన్నంత ప్రచారం జరిగింది. దాంతో కాంగ్రెస్ లో మళ్ళీ రచ్చ మొదలయ్యింది. మునుగోడులో మరో అభ్యర్థిని కూడా కాంగ్రెస్ రడీ చేసింది కూడా. ఈ నేపథ్యంలో రాజ గోపాల్ రెడ్డి మళ్ళీ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.

అసలు తాను కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నానని, బీజేపీలో చేరుతున్నానని ఎవరు చెప్పారు ? కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలవడం తప్పా ? అని ఆయన ప్రశ్నించారు. ఆయనతో తాను రాజకీయాలు మాట్లాడలేదని కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ''తాను కాంగ్రెస్ కు రాజీనామా చేసే ప్రసక్తే లేదు. బీజేపీలో చేరేది కూడా లేదు. ఈ దుష్ప్రచారమంతా టీఆరెస్ పార్టీ చేస్తున్నది. నేను రాజీనామా చేస్తున్నానని, ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం చేస్తున్నారు. నా రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటే నేను రాజీనామా చేసేందుకు సిద్ధమే'' అని అన్నారు రాజ్ గోపాల్ రెడ్డి.

నేను కాంగ్రెస్ మంచి కోసమే ఏదైనా మాట్లాడుతాను తప్ప ఆ పార్టీని బలహీనపర్చడానికి కాదని చెప్పిన రాజ్ గోపాల్ రెడ్డి భువనగిరి ప్రజలతో మాట్లాడాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటానని చెప్తూ పార్టీ మార్పు చారిత్రాత్మకమైన అనివార్యత అని మరో ట్విస్ట్ ఇచ్చాడు. అంతే కాదు పరోక్షంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద కూడా బాణాలు విసిరాడు. ''తప్పుడు పనులు చేసి, స్వార్దం కోసం దొంగపనులు చేసి, జైలుకు పోయొచ్చినోళ్ళు నీతులు చెప్తున్నారు. మాలాంటి వ్యక్తులం వాళ్ళతో నీతులు చెప్పించుకోవాలా? వాళ్ళ నాయకత్వంలో పనిచేయాలా ?'' అని రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటాడా... లేక బీజేపీలో చేరతాడా.... అసలు ఆయన మాటల‌కు అర్దమేంటి అనేది అర్దం కాక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తలకాయలు పట్టుకుంటున్నారట. 

Tags:    
Advertisement

Similar News