విచారణ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం -కేసీఆర్

విద్యుత్ కొనుగోళ్లు, సరఫరా ఒప్పందాలు, వివాదాలపై విచారించే పరిధి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (SERC)కి మాత్రమే ఉందని అన్నారు కేసీఆర్.

Advertisement
Update: 2024-06-26 07:33 GMT

బీఆర్ఎస్ హయాంలో చత్తీస్ ఘడ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ని నియమించిన సంగతి తెలిసిందే. ఆ కమిషన్ కేసీఆర్ కి నోటీసులివ్వడంతో అసలు కథ మొదలైంది. విచారణ కమిషన్ కి నేతృత్వం వహిస్తున్న హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిపై కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన్ను కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ ఘాటు లేఖ రాశారు కేసీఆర్. ఆ లేఖ సంచలనంగా మారినా ఎల్.నరసింహారెడ్డి తగ్గేది లేదన్నారు. మరోసారి విచారణకు హాజరవ్వాలంటూ కేసీఆర్ కి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీంతో కేసీఆర్ మరో అడుగు ముందుకేశారు. అసలు కమిషన్ ఏర్పాటు చట్ట విరుద్ధమంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఛత్తీస్‌ ఘడ్ నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని, కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అయిందనేది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. విద్యుత్ కొనుగోళ్లతోపాటు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్ కేంద్రాల నిర్మాణాల్లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ విచారణ చేపట్టింది. అయితే ఈ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం అంటున్నారు కేసీఆర్. కమిషన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఇంధనశాఖ మార్చి 14న జారీ చేసిన జీవో కొట్టివేయాలని, కమిషన్ ని రద్దు చేయాలని తన పిటిషన్ లో హైకోర్టుని కోరారు.

విద్యుత్ కొనుగోళ్లు, సరఫరా ఒప్పందాలు, వివాదాలపై విచారించే పరిధి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఎస్‌ఈఆర్‌సీ)కి మాత్రమే ఉందని అంటున్నారు కేసీఆర్. విద్యుత్ చట్టం ప్రకారం కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ.. కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ చట్టంలోని సెక్షన్‌ 61, 62, 86లకు విరుద్ధమని, దీనిపై రాష్ట్ర సర్కారు అధికారాలు పరిమితమన్నారు. కమిషన్‌ విచారణ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని, అసలు కమిషన్‌ ఏర్పాటే చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయాలన్నిటితో తాను లేఖ రాసినా కమిషన్ ఈనెల 19న మరోసారి ప్రొసీడింగ్స్ జారీ చేసిందని తన పిటిషన్ లో కోర్టుకి తెలిపారు కేసీఆర్. తన పిటిషన్ లో ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి, విచారణ కమిషన్, కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారాయన. అయితే ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News