పవన్ అభిమానినే కానీ, జనసేనకు మద్దతివ్వను.. బండ్లన్న కామెంట్స్ వైరల్

పవన్ పై ఇంత అభిమానం చూపించే బండ్లన్న గత ఎన్నికల సమయంలో జనసేనను కాదని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తెలంగాణలో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించాడు.

Advertisement
Update:2023-11-09 20:22 IST

కమెడియన్‌గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించాడు. అయితే బండ్ల గణేష్ కమెడియన్ గా, నిర్మాతగా తెచ్చుకున్న గుర్తింపు కంటే పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా తెచ్చుకున్న గుర్తింపు ఎక్కువే. మైకు దొరికితే చాలు పవన్ భజన చేస్తుంటాడు బండ్ల గణేష్. నా దైవం పవనేనని చెబుతుంటాడు.

పవన్ పై ఇంత అభిమానం చూపించే బండ్లన్న గత ఎన్నికల సమయంలో జనసేనను కాదని కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తెలంగాణలో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించాడు. టికెట్ దక్కకపోవడంతో మళ్లీ రాజకీయాలకు దూరమ‌య్యాడు. ఇక రాజకీయాల జోలికి వెళ్ళనని ప్రకటించాడు.

తనకు టికెట్ ఇవ్వనందుకు కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన బండ్ల గణేష్ ఎన్నికల ముంగిట తిరిగి కాంగ్రెస్ జపం చేస్తున్నాడు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన బండ్ల గణేష్ రాజకీయాలకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేశాడు. తాను మొదటి నుంచి పక్కా కాంగ్రెస్ వాదినని.. గాంధీభవన్ తన పుట్టినిల్లు..అని అన్నాడు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపడుతుందని.. డిసెంబర్ 9న ఆ పార్టీ అభ్యర్థి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా జోస్యం చెప్పాడు.

ఈసారి తెలంగాణలో మీ దేవుడు పవన్ కళ్యాణ్ పార్టీ కూడా పోటీ చేస్తోంది కదా? ఆయనకు మద్దతు ఇవ్వరా? అని.. మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అస్సలు ఇవ్వనంటూ.. బండ్ల గణేష్ సమాధానం ఇచ్చాడు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినే అయినప్పటికీ జనసేన పార్టీకి మద్దతు ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు. బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

``మొదట కాంగ్రెస్ పార్టీలో చేరావ్.. టికెట్ దక్కకపోవడంతో జనసేనలో చేరడానికి ప్రయత్నించావు.. అక్కడ అవకాశం లభించకపోవడంతో టీడీపీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నించావు.. చివరకు మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరై తుదిశ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉంటానంటూ ప్రకటిస్తున్నావు.. ఇలా మాటలు మార్చే నిన్ను ఎవరూ నమ్మరు బండ్ల గణేష్..`` అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News