తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం
వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులకు వెళ్లే టైమ్ కావడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. ఉదయం ఉన్నట్టుండి మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, రాజేంద్రనగర్, తుర్కయాంజల్, సరూర్‌నగర్, నాగోల్, చంపాపేట, సైదాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో వాన దంచికొట్టింది. అశోక్‌నగర్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, రాంనగర్, అడిక్‌మెట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, తార్నాక, ఓయూ క్యాంపస్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులకు వెళ్లే టైమ్ కావడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అకస్మాత్తుగా వర్షం కురవడంతో దుకాణాలు, మెట్రో పిల్లర్ల కింద జనం తలదాచుకున్నారు. కొన్ని రోజులుగా ఎండలతో అల్లాడిన జనాలకు వర్షం కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది.
మరోవైపు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో తీవ్రస్థాయిలో పంట నష్టం జరిగింది. వరి, మామిడి కాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులకు చెట్లు నెలకొరిగాయి, పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా నందిపేటలో పిడుగు పడి 3 గేదెలు చనిపోయాయి.