సెక్రటేరియట్ లో వనపర్తి ఎమ్మెల్యేకు ఘోర అవమానం
ఆరో ఫ్లోర్ లో సీఎస్ వస్తున్నారని ఎమ్మెల్యేలను పక్కకు తోసేసిన సెక్యూరిటీ సిబ్బంది
తెలంగాణ సెక్రటేరియట్ లో వనపర్తి ఎమ్మెల్యేకు ఘోర అవమానం జరిగింది. సెక్రటేరియట్ లోని ఆరో అంతస్తులో గల ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి చాంబర్ కు శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెళ్తున్నారు. అదే సమయంలో డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల సమీక్షలో పాల్గొని శాంతి కుమారి ఎదురుగా వస్తున్నారు. కారిడార్ లో ఉన్న వాళ్లను పక్కకు తోసేసే క్రమంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే మేఘారెడ్డిని పక్కకు తోశారు. సెక్యూరిటీ సిబ్బందిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరినో తెలుసుకోకుండా తోసేస్తారా అని మండిపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది అంతే నిర్లక్ష్యంతో ఎవరో తెలియదని చెప్తున్నాం కదా అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం చాంబర్ తో పాటు సీఎంవో ఉన్న ఆరో ఫ్లోర్ లోకి సాధారణ వ్యక్తులకు ఎంట్రీనే లేదు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే ఆరో ఫ్లోర్ కు వస్తుంటారు. అలాంటి హై సెక్యూరిటీ జోన్ లో ఎమ్మెల్యే కు అవమానం జరగడం సెక్రటేరియట్ లో చర్చనీయాంశంగా మారింది.