25న మానుకోటలో బీఆర్‌ఎస్‌ మహాధర్నా

మానుకోట నుంచే రేవంత్‌ పతనం స్టార్ట్‌ అయ్యింది.. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌

Advertisement
Update:2024-11-22 13:34 IST

లగచర్ల ఫార్మా బాధితులకు అండగా ఈనెల 25న మహబూబాబాద్‌ లో దళిత, గిరిజన రైతులతో మహా ధర్నా చేస్తామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. మానుకోటలో తాము ధర్నా చేస్తామంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని.. ధర్నాకు అనుమతి ఇచ్చిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. మానుకోట నుంచే రేవంత్‌ రెడ్డి పతనం ప్రారంభమయ్యిందని హెచ్చరించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌ లో ఆమె విలేకరులతో మాట్లాడారు. మొన్నటి వరకు ఊరు దాటని గిరిజన మహిళలు ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారని, ఇకనైనా రేవంత్‌ రెడ్డి కళ్లు తెరిచి లగచర్లలో ఫార్మా పరిశ్రమను రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాహుల్‌ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తే అదే రాజ్యాంగాన్ని రేవంత్‌ ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. సొంత నియోజకవర్గంలోని రైతులనే మెప్పించలేని రేవంత్‌ ఇక రాష్ట్రాన్ని ఏం మెప్పిస్తాడని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ఎక్కడ మీటింగ్‌ పెట్టినా బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్ట్‌ చేస్తున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌ రావు అన్నారు. ప్రభుత్వం నిర్మించిన భవనాలు వదిలేసి రేవంత్‌ రెడ్డి తన ఇంటికాడ ఇనుప కంచెలు వేసుకొని ఉంటున్నాడని, ఆయన ప్రజా భవన్‌ లో ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రశ్నించారు. మానుకోటలో పోలీసులు ఎందుకు కవాతు చేశారు.. ఎందుకు 144 సెక్షన్‌ పెట్టారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ప్రశ్నించారు. 25న గిరిజనులకు మద్దతుగా కేటీఆర్‌ నిర్వహించే మానుకోట ధర్నాకు అన్ని గిరిజన సంఘాలు తరలి రావాలని మాజీ ఎంపీ మాలోతు కవిత విజ్ఞప్తి చేశారు.

Tags:    
Advertisement

Similar News