కఠినమైన వాస్తవం... రెండు భారతదేశాలు
ఒకవైపు పేదరికంతో కునారిల్లుతున్న భారత దేశం , మరో వైపు లక్షల కోట్ల ఆస్తులతో తులతూగుతున్న భారదేశం...ఇలా దేశం రెండుగా చీలిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటారు. రోజు వారీ రాజకీయాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక పరిస్థితులు...ఇలా ఒకటేమిటి ప్రతి అంశంపై ఆయన స్పందిస్తూ ఉంటారు. ఒక్కో సారి సీరియస్ గా మరో సారి వ్యంగ్యంగా ఆయన ట్వీట్లు చేస్తూ ఉంటారు. ఇక బీజేపీ పై ఆయన చేసే ట్వీట్లు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా వైరల్ అవుతాయి.
ఈ రోజు కొద్ది సేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరినీ తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. భారతదేశం ఒకటి కాదని రెండు భారతదేశాలున్నాయని ఆయన చేసిన ట్వీట్ పై లోతుగా ఆలోచిస్తే నిజాలు బోధపడుతాయి.
ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ దిగజారి నైజీరియా అనే ఓ పేద దేశంకన్నా ఎక్కువ పేదరికంతో కునారిల్లుతోందని వరల్డ్ పావర్టీ క్లాక్ ఇటీవల ప్రకటించింది.
2018 లో నైజీరియాలో అత్యంత పేదరికంలో ఉన్న జనాభా 8కోట్ల 70 లక్షల మందికాగా అదే భారత దేశంలో అప్పుడు పేదరికంలో ఉన్న జనాభా 7కోట్ల 30 లక్షలు. ఇక 2022 కు వచ్చేసరికి నైజీరియాలో పేదరికంలో మగ్గుతున్న జనాభా సంఖ్య తగ్గి 7 కోట్లకు చేరగా అదే భారత దేశంలో ఆ సంఖ్య పెరిగి 8కోట్ల 30 లక్షలకు చేరుకుంది. ఇది ఒక భారతదేశమైతే....
మరో వైపు పారిశ్రామిక వేత్తల ఆదాయాలు అనేక రెట్లు పెరిగిపోతున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా పేదలు మరింత పేదలుగా, మధ్యతరగతి వర్గాలు కూడా పేదలుగా మారితే పారిశ్రామిక వేత్తలు మాత్రం ఎప్పటికన్నా ఎక్కువ లాభాలతో ముందుకు సాగారు. భారత దేశ ప్రముఖ వ్యాపార వేత్త , ప్రధాని మోదీకి అత్యంత సనిహితుడైన గౌతమ్ అదానీ ప్రంచంలోని అనేక మంది ధనికులను దాటుకొని ప్రపంచంలోనే 4వ స్థానానికి చేరుకున్నారు. గురువారంనాడు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం అదానీ ఆదాయం 115.5 బిలియన్ డాలర్లకు చేరుకొని బిల్ గేట్స్ ను దాటుకొని ముందుకు దూసుకెళ్ళారు. ఇది రెండో భారతదేశం.
ఈ రెండు విషయాలను ప్రస్తావించిన కేసీఆర్ ...
''కఠినమైన వాస్తవం,,, రెండు భారతదేశాలు
ప్రపంచ పేదరిక రాజధానిగా నైజీరియాను భారత్ అధిగమించింది
బిల్ గేట్స్‌ను అధిగమించి అదానీ ప్రపంచంలోనే 4వ ధనవంతులయ్యారు'' అని ట్వీట్ చేశారు.
ఒకవైపు ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత పేదలుగా మారి ఒకే దేశం రెండు దేశాలుగా మారిన తీరును వివరించిన కేటీఆర్ మాటలు సీరియస్ గా ఆలోచించాల్సినవి.