రేవంత్ సర్కారు తొందరపాటు.. ప్రమాదంలో ఎస్ ఎల్ బీసీ భవితవ్యం
ఆగమాగం పనులు మొదలు పెట్టడంతోనే పెను ప్రమాదం.. టన్నెల్ ప్రాజెక్టు పట్టాలెక్కడంపై సందేహాలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వ తొందరపాటు ఎస్ ఎల్ బీసీ టన్నెల్ ప్రాజెక్టు భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసింది. క్రెడిట్ గేమ్.. కేసీఆర్ ను బద్నాం చేయాలనే పన్నాగం.. టన్నెల్ ప్రాజెక్టుల్లాంటి క్లిష్టమైన పనులు చేసిన అనుభవం లేకపోవడం.. ఆ ఇద్దరు మంత్రుల ఆరాటం వెరసి కీలక ప్రాజెక్టును ఆదారేళ్లు వెనక్కి తీసుకెళ్లింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన పన్నాగాలు బూమరాంగ్ అయ్యాయి. దుర్భిక్ష నల్గొండను సజీవ జల స్రవంతిగా మార్చే ఎస్ ఎల్ బీసీ టన్నెల్ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దశాబ్దాలుగా అగుతూ.. సాగుతూ అవస్థలు పడుతోన్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు ఇకనైనా పూర్తవుతుందని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగిలింది. కేసీఆర్ పై రాజకీయ ఆధిపత్యం సాధించాలనే ప్రయత్నం మొత్తం ప్రాజెక్టునే ప్రమాదంలోకి నెట్టేసింది. ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టును 20 నెలల్లోనే పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లిస్తామని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. టన్నెల్ ప్రాజెక్టు లో ఉన్న ప్రతిబంధకాలు ఏమిటో తీసుకోకుండా అసెంబ్లీ వేదికగా అడ్డగోలు ప్రకటనలు చేశారు. కేసీఆర్ ఎలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు పనులు నిలిపి వేశారో తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కేసీఆర్ ఈ ప్రాజెక్టు పనుల పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలు ఏమిటో కూడా స్టడీ చేయలేదు. ప్రతికూల పరిస్థితుల్లో పనులు చేయాలంటే ఆవేశం కాదు ఆలోచన అవసరం అన్న తత్వం టన్నెల్ ప్రమాదం తర్వాత కానీ ప్రభుత్వ పెద్దలకు బోధ పడలేదు.
శ్రీశైలం వైపు నుంచి టన్నెల్ తవ్వకం పనులు మొదలు పెట్టిన నాలుగు రోజులకే పెను ప్రమాదం జరిగింది. ఇన్ లెట్ టన్నెల్ 13.5 కి.మీల వద్ద ఏర్పడిన సీపీజీలను నివారించేందుకు చేసిన ప్రయత్నాలే ప్రమాదానికి కారణం అయ్యాయి. వర్క్ ఏజెన్సీని ముఖ్యమంత్రి, మంత్రులు తరమడంతో మొండిగా పనులు కొనసాగించి మొత్తం ప్రాజెక్టునే ప్రమాదంలో పడేశారు. ఎనిమిది కుటుంబాలు తమ వాళ్లకు ఏమయ్యిందో తెలియని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి కల్పించింది. రేవంత్ ప్రభుత్వ తొందరపాటుతో సొరంగం తవ్వాల్సిన టన్నెల్ బోరింగ్ మిషన్ అక్కరకు రాకుండా పోయింది. ప్రమాదంలో దెబ్బతిన్న టీబీఎంను పునరుద్దరించడం సాధ్యం కాదని.. కొత్త టీబీఎంను తెప్పించి పనులు చేయాలంటే కనీసం మూడేళ్లు పడుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో ఇతర మార్గాల్లో పనులు చేయాలంటే కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి. ఇది అనేక సంక్లిష్టతలతో ముడిపడి ఉన్నది. అంటే ప్రాజెక్టు పనులు తిరిగి మొదలు కావడం కొన్నేళ్ల తర్వాతగాని సాధ్యమయ్యే పరిస్థితి లేదు.
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది మీటర్లు కూడా టన్నెల్ తవ్వలేదని ఒక మంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో చేసిన పనుల వల్లనే ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఇరిగేషన్ శాఖ మంత్రి రాజకీయ విమర్శలు చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్ ఎల్ బీసీ టన్నెల్ తో పాటు డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకల రిజర్వాయర్ నిర్మాణానికి రూ.3,600 కోట్లు ఖర్చు చేశారు. 2014 నాటికే కాంట్రాక్టు సంస్థ పనులు ఆపేయడంతో కేసీఆర్ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశం ఏర్పాటు చేసి అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి సాక్షిగా రూ.100 కోట్ల అడ్వాన్స్ ఇచ్చి పనులు ప్రారంభించేలా చేశారు. కరోనా లాక్ డౌన్ తర్వాత మరోసారి రూ.100 కోట్ల అడ్వాన్స్ ఇప్పించి పనులు మొదలు పెట్టించారు. అనేక ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా 11 కి.మీ ల టన్నెల్ తవ్వారు. ఈ వాస్తవాలను రేవంత్ ప్రభుత్వం తొక్కిపెట్టి తన చేతగాని తనాన్ని, తన తప్పులను బీఆర్ ఎస్ పైక్ నెట్టి తప్పించుకోవాలని చూస్తోంది.