దమ్ముంటే తమిళనాడులో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయండి..
చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందన్నారు హరీష్ రావు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగానే ఉద్యమంలో యువకులు బలిదానం చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు మంత్రి హరీష్ రావు. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారు అని అన్నారు. కాంగ్రెస్ కి తెలంగాణ ప్రజలు 11 ఛాన్స్ లు ఇచ్చారని, చిదంబరంకు దమ్ముంటే ఆయనన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణ సాధించింది కేసీఆర్ అని, సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మోడల్ గా నిలిపింది కూడా కేసీఆరేనని చెప్పారు హరీష్ రావు.
ఎవరెన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని దీవించబోతున్నారని చెప్పారు హరీష్ రావు. చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందన్నారు. తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగానే ఉద్యమంలో యువకులు బలిదానం చేశారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు హరీష్ రావు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారం లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారాయన. అప్పటి నెహ్రూ ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే పొట్టి శ్రీరాములు చనిపోయారని గుర్తు చేశారు. చరిత్రకు చిదంబరం వక్ర భాష్యాలు చెబుతున్నారన్నారు.
అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేదని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు హరీష్ రావు. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారని చెప్పారు. తెలంగాణ అప్పులు, ఆదాయంపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహిస్తే మంచిదన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబరం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు హరీష్ రావు.