అమరుల స్మారకం.. తెలంగాణ చరిత్రలో చెరిగిపోని సంతకం
సెక్రటేరియట్ ని కూల గొడతామని ఓ నాయకుడు అంటే, మరో నాయకుడు పేల్చేస్తామంటున్నారని, అలాంటి వారు తెలంగాణలో ప్రతిపక్ష నేతలుగా ఉండడం దురదృష్టకరమని విమర్శించారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న అమరుల స్మారకం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ సాధనకు వారు చేసిన త్యాగాలు అందరూ గుర్తుంచుకునేలా ఆ స్మారకం నిలుస్తుందని చెప్పారు. జూన్ 2న అమరుల స్ఫూర్తి చిహ్నాన్ని ప్రారంభించుకుంటామన్నారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ అమరుల త్యాగాలు గుర్తుంచుకునేలా ఈ స్మారక చిహ్నం నిర్మిస్తున్నామని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన ప్రతి ఒక్క అమరవీరుని కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలో అమరవీరుల స్థూపాన్ని మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.
కూలుస్తాం, పేలుస్తాం..
తెలంగాణలో ప్రతిపక్ష నేతలు అభివృద్ధి కంటకులు అని మండిపడ్డారు హరీష్ రావు. హైదరాబాద్ నడి బొడ్డున డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు మీద సెక్రటేరియట్ నిర్మిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ చూసి ఊర్చుకోలేకపోతున్నాయని చెప్పారు. సెక్రటేరియట్ ని కూల గొడతామని ఓ నాయకుడు అంటే, మరో నాయకుడు పేల్చేస్తామంటున్నారని, అలాంటి వారు తెలంగాణలో ప్రతిపక్ష నేతలుగా ఉండడం దురదృష్టకరమని విమర్శించారు.
ముంబాయి, దుబాయి బొగ్గుబాయి అనే తెలంగాణ బతుకులు.. ఇవాళ భూమికి బరువయ్యేంత పంట పండిస్తున్నాయని చెప్పారు హరీష్ రావు. వరినాట్లు వేసేందుకు పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. ‘ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ ఒకేసారి వేస్తే తమకు కార్యకర్తలు దొరకకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారని, దాన్నిబట్టి వారి మానసిక పరిస్థితి ఏంటో అర్ధమవుతోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందన్నారు హరీష్ రావు. సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని గ్రామాల సర్పంచ్ లు తెలంగాణ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కావాలంటూ వారి రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తున్నారని, లేకపోతే ఆ గ్రామాలను కూడా తెలంగాణలో కలపాలంటున్నారని.. అదీ నేటి తెలంగాణ పరిస్థితి అని వివరించారు.