అమెరికాలో బియ్యానికి భారీ డిమాండ్.. ఎగబడి మరీ కొంటున్న ఎన్ఆర్ఐలు.. అసలు కారణం ఇదే

బియ్యం కొరత వస్తుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయడంతో చాలా మంది ఎన్ఆర్ఐలు ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు పరుగుతు తీస్తున్నారు.

Advertisement
Update:2023-07-22 09:48 IST

అమెరికా, కెనడా దేశాల్లో భవిష్యత్‌లో బియ్యానికి కొరత వస్తుందనే ఆందోళనతో ఎన్ఆర్ఐలు భారీగా స్టోర్ల ముందు క్యూ కడుతున్నారు. గత రెండు రోజులుగా బియ్యం దొరకదేమో అనే అనుమానాలతో భారీగా కొనుగోలు చేసి ఇంట్లో స్టోర్ చేసుకుంటున్నారు. ఎన్ఆర్ఐలు అమెరికా, కెనడా సూపర్ మార్కెట్ల వద్ద భారీగా క్యూ కట్టిన దృశ్యాలతో పాటు, స్టోర్లలో బియ్యం కోసం ఎగబడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాస్మతేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంతో.. అమెరికాలో సోనా మసూరీ బియ్యం దొరకదేమో అనే అనుమానంతోనే భారతీయులు ఇలా క్యూలు కడుతున్నట్లు తెలుస్తున్నది.

బియ్యం కొరత వస్తుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయడంతో చాలా మంది ఎన్ఆర్ఐలు ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. ఒక్కో వ్యక్తికి అనుమతించిన మేరకు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. అమెరికా అంతటా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లు తెలుస్తున్నది. అమెరికాలో ఇప్పటికే పలు ఆహార వస్తువులకు కొరత ఏర్పడింది. తాజాగా బియ్యం కూడా ఆ జాబితాలో చేరే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు.

అమెరికా మీడియాలో బాస్మతేతర బియ్యంపై భారత్ నిషేధం విధించినట్లు వార్తలు వచ్చిన వెంటనే.. ఎన్ఆర్ఐలు ఆందోళన చెందారు. భారీ సంఖ్యలో సూపర్ మార్కెట్లు, సమీపంలోని స్టోర్లకు వెళ్లి బియ్యం కొనుగోలు చేయడం మొదలు పెట్టినట్లు వ్యాపారలు చెబుతున్నారు. ఎన్ఆర్ఐలు భారీగా బియ్యం కొనుగోలు చేయడంతో వ్యాపారులు రేట్లు కూడా పెంచేశారు. గతంలో బ్యాగ్ 20 డాలర్లు ఉండగా.. ఇప్పుడు రెట్టింపు ధరకు అమ్ముతున్నట్లు తెలుస్తున్నది.

గతంలో కేవలం కొన్ని బ్రాండ్ల బియ్యానికే డిమాండ్ ఉండేదని.. కానీ ఇప్పుడు బ్రాండ్ పేర్లు ఏమీ చూడకుండా.. బియ్యం కనపడితే కొనేస్తున్నారని ఒక స్టోర్ నిర్వాహకుడు చెప్పారు. డిమాండ్ పెరగడం వల్లే ధర కూడా పెంచాల్సి వచ్చిందన్నారు. కాగా, ఇప్పటికిప్పుడు బియ్యం కొరత వచ్చే అవకాశం లేదని.. అయితే, భారతీయులు ఎగబడి కొనడం వల్లే తాత్కాలిక కొరత ఏర్పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బియ్యం ఎగుమతుల విషయంలో భారత్ మరోసారి పునరాలోచన చేయాలని కోరుతున్నారు. 


Tags:    
Advertisement

Similar News