హసీనాను స్వదేశానికి రప్పించడమే మాకు ప్రాధాన్యం
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ దోపిడీ దొంగ అని విమర్శించిన షేక్ హసీనా
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఘాటు విమర్శలు చేస్తున్న విషయం విదితమే. యూనస్ ఉగ్రవాదులను విడుదల చేశారని, అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. హసీనా వ్యాఖ్యాలపై ఢాకా ప్రభుత్వం స్పందించింది. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానిని తమ దేశంలోకి రప్పించడమే తమ అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యమని యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫీకుల్ ఆలం పేర్కొన్నారు. హసీనాను న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన ఉన్నందున ఆమెను తమకు అప్పగించాలని భారత్‌ను కోరుతున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తామన్నారు.
బంగ్లాదేశ్‌లోని హసీనా అవామీలీగ్ పార్టీని రాజకీయాల్లో కొనసాగించాలా.. వద్దా అనే విషయాన్ని దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు నిర్ణయిస్తాయని అన్నారు. అయితే ఆమె అధికారంలో ఉన్న సమయంలో జరిగిన హత్యలు, అదృశ్యాలు, ఇతర నేరాలకు పాల్పడినవారు తప్పకుండా శిక్ష అనుభవించి తీరుతారని అన్నారు. హసీనా దేశ ప్రధానిగా ఉన్న సమయంలో అధికారం చేకూరకూడదనే ఉద్దేశంతో నిరసనకారులను హత్య చేసినట్లు, దాడులు జరిపినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొన్న నివేదికలను ఆయన ఉదహరించారు. హసీనా ప్రభుత్వం సృష్టించిన విధ్వంసాన్ని మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలని యూఎన్ అభివర్ణించిందని తెలిపారు. కాగా ఈ విషయంపై భారత్ నుంచి ఎటువంటి స్పందన లేదు.