డాలర్‌కు బదులు మరో కరెన్సీ తీసుకొస్తే 'బ్రిక్స్' అంతమే
మాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే.. ఆయా దేశాల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరిక
బ్రిక్స్ దేశాలు డాలర్ తో ఆటలు ఆడాలనుకుంటే తాము వాణిజ్యంతో వారికి చెక్ పెడుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ ట్రంప్‌తో భేటీ అయిన విషయం విదితమే. ఈ భేటీకి కొన్ని గంటల ముందే ట్రంప్ ఈ హెచ్చరికలు చేయడం విశేషం. బ్రిక్స్‌ను విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా.. లేక అందులో భాగమవుతారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
బ్రిక్స్ ఓ చెడ్డ ప్రతిపాదననను తీసుకొచ్చింది. చాలామందికి అది ఇష్టం లేదు. ప్రస్తుతం దానిపై మాట్లాడటానికి కూడా వారు వెనుకాడుతున్నారు. డాలర్‌తో ఆడుకోవాలనుకుంటే చర్యలు తీసుకుంటాననే నా హెచ్చరికలతో వారు భయపడ్డారు. మాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే.. ఆయా దేశాల దిగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తాను. ఒకవేళ వారు అది చేయాలనుకుంటే.. టారిఫ్‌లు విధించవద్దని నా దగ్గరకు వచ్చి వేడుకుంటారు. నా బెదిరింపులతో బ్రిక్స్ అంతమైంది అని ట్రంప్ పేర్కొన్నారు.
గత ఏడాది అక్టోబర్ రష్యాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీ రూపొందించడంపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీ వాడుకోవడానికి భారత్‌తో కలిసి రష్యా పనిచేస్తున్నదన్నారు. సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలని పుతిన్ కోరారు.దీనిపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. కాగా అట్లాంటిక్ కౌన్సిల్‌కు చెందిన జియో ఎకనామిక్స్ సెంటర్ గత సంవత్సరం చేసిన అధ్యయనంలో బ్రిక్స్ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా డాలర్‌పై ప్రపంచదేశాలు ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించలేవని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు డాలర్‌కు బదులు మరో కరెన్సీ తీసుకొస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తామని ఇప్పటికే పలుమార్లు ట్రంప్ హెచ్చరించారు.