అమెరికాలో గాల్లో ఢీకొన్న విమానాలు.. ఇద్దరి దుర్మరణం
అమెరికాలోని ఆరిజోనాలో రెండు విమానాలు గాల్లో ఒకదాన్నొకటి ఢీకొట్టాయి.
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. జనవరి నెల 31న ల్యాండ్ అవుతున్న ఓ విమానాన్ని హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో 67 మంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. అమెరికాలోని ఆరిజోనాలో రెండు విమానాలు గాల్లో ఒకదాన్నొకటి ఢీకొట్టాయి. ఈ క్రమంలో ఓ విమానం కుప్పకూలగా మరొకటి ల్యాండ్ అయింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం తాలూకు వీడియో ఒకటి నెట్‌లో చక్కర్లు కొడుతోంది. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది.
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం రన్ వే పై సెస్నా 1725, లాంకైర్ 360 ఎంకే 11 ఢీకొన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఓవైపు అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు భయపెడుతుంటే.. మరోవైపు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఎఫ్ఏఏ వర్కర్లు, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించే పనిలో ఉన్నారు. ఇప్పటికే వందలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.