పనామా హోటల్‌లో అక్రమవలసదారులు

వారంతా భారత్‌, ఇరాన్‌, నేపాల్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌తో సహా పలు దేశాలకు చెందినవారని అధికారుల వెల్లడి

Advertisement
Update:2025-02-19 08:45 IST

అమెరికా నుంచి తరలిస్తున్న భారత్‌తో సహా పలు దేశాల అక్రమ వలసదారులను తమ దేశంలోకి తీసుకుంటున్న పనామా ప్రకటించింది. వారందరికీ ఒక హోటల్‌లో బస ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అయితే వారిలో 40 శాతం మందికి తిరిగి తమ స్వదేశానికి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని అక్కడి అధికారులు పేర్కొనడం విశేషం.

సుమారు 300 మంది వలసదారులు తమ దేశానికి చేరినట్లు పనామాకు చెందిన మంత్రి ఫ్రాంకా అబ్రెగో తెలిపారు. వారంతా భారత్‌, ఇరాన్‌, నేపాల్‌, శ్రీలంక, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌తో సహా పలు దేశాలకు చెందినవారని వెల్లడించారు. ఈ ప్రక్రియ మొత్తానికి అయ్యే ఖర్చును అమెరికానే భరిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు బహిష్కరణకు గురైన వారిని ఓ హోటల్‌లో నిర్బంధించారంటూ పలు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో తాజాగా అబెగ్రో వాటిని ఖండించారు. వలసదారులను ఉంచుతున్న హోటల్‌ పోలీసుల అధికారుల పర్యవేక్షణలో ఉందని వెల్లడించారు.

ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో లాటిన్‌ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్వాటమాల, పనామా దేశాలతో వలసదారుల తరలింపుపై ఒప్పందాలు చేసుకున్నారు. గత వారం 119 మంది చైనా, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ వలసదారులను పనామాకు తరలించగా.. గ్వాటమాలకు మాత్రం ఇంకా అమెరికా వలసదారులను తరలించలేదు. కోస్టారికాతో కూడా అమెరికా ఇలాంటి ఒప్పందాలే చేసుకున్నది. భారత్‌తో సహా ఆసియా దేశాలకు చెందిన దాదాపు 200 మంది అక్రమ వలసదారులు తమ దేశానికి చేరుకున్నట్లు కోస్టారికా అధికారులు వెల్లడించారు. ఇక అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొరడా ఝుళిపిస్తున్న క్రమంలో ఆ దేశం నుంచి 112 మంది భారతీయులు సైనిక విమానంలో ఆదివారం రాత్రి అమృతసర్‌ చేరుకున్నారు. ఇప్పటికే రెండు విమానాలు అమెరికా నుంచి రాగా.. ఇది మూడోది.

Tags:    
Advertisement

Similar News