రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి మూడేళ్లు

ఈ నేపథ్యంలో శత్రుదేశం ఏకంగా 267 డ్రోన్లు ప్రయోగించినట్లు కీవ్‌ ఆరోపణ

Advertisement
Update:2025-02-23 21:38 IST

ఉక్రెయన్‌పై రష్యా దండయాత్ర కు రేపటికి (సోమవారం) సరిగ్గా మూడేళ్లు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ వ్యాప్తంగా పుతిన్‌ సేనలు మరోసారి భీకర దాడులకు పాల్పడ్డారు. శత్రుదేశం ఏకంగా 267 డ్రోన్లు ప్రయోగించినట్లు కీవ్‌ ఆరోపించింది. యుద్ధం మొదలు ఒకేసారి ఈ స్థాయిలో డ్రోన్లతో దాడులకు పాల్పడటం ఇదే మొదటిసారి అని ఉక్రెయిన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కమాండ్‌ ప్రతినిధి యూరీ ఇగ్నాత్ తెలిపారు. అయితే, వాటిలో సగానికి పైగా కూల్చివేసినట్లు చెప్పారు. ప్రాణనష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

గత వారం వ్యవధిలో సుమారు 1150 డ్రోన్లు, 1400లకు పైగా గైడెడ్‌ ఏరియల్‌ బాంబులు, 35 క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యా రక్షణశాఖ కూడా తమ దేశంలోకి కీవ్‌ సేనలు 20 డ్రోన్లను ప్రయోగించిందని,వాటని నాశనం చేసినట్లు తెలిపింది. మరోవైపు 'డిఫెండర్‌ ఆఫ్‌ ది ఫాదర్‌ల్యాండ్‌ డే' ను పురస్కరించుకుని రష్యా అధినేత పుతిన్‌ సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. యుద్ధంలో పోరాడిన సిబ్బందికి పతకాలను ప్రదానం చేశారు.

2022 ఫిబ్రవరి 24న ' ప్రత్యేక మిలటరీ ఆపరేషన్‌' పేరుతో రష్యా యుద్ధాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాటో విస్తరణను నిలువరించే ప్రయత్నం, డాన్‌బాస్‌ విమోచనం, నాజీయిజం నిర్మూలన వంటివి తమ లక్ష్యాలుగా పుతిన్‌ ప్రకటించారు. మొదట్లో మాస్కో సేనలు దూకుడు కనబరిచినా.. అనంతరం పాశ్చాత్య దేశాల ఆయుధ సాయంతో కీవ్‌ కూడా దీటుగా స్పందించింది. ఈ మూడేళ్లలో ఇరువైపులా లక్షలాదిమంది సైనికులు మరణించారు, గాయపడ్డారు. కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ మరోసారి ఎన్నిక కావడంతో యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. 

Tags:    
Advertisement

Similar News