ఆస్తి కోసం తాతను కత్తితో పొడిచి హత్య చేసిన మనవడు
మిగతా మనవలను చూసినట్లుగా తనను చూడలేదని ఆస్తి పంచడం లేదని తాతను మనవడు హత్య చేశాడు
ఆస్తి తగాదాల విషయంలో కారణంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర(వీసీ) జనార్దనరావు తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఏలూరు ప్రాంతానికి చెందిన వీసీ జనార్ధన్ రావు కొన్నేళ్లుగా హైదరాబాద్ సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తన పెద్ద కుమార్తె కొడుకు శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టరుగా నియమించి, మరో కుమార్తె కొడుకు కీర్తి తేజ పేరుపై రూ.4 కోట్ల షేర్లను బదిలీ చేశాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం జనార్ధన్ రావు, కీర్తి తేజ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై మాట్లాడడానికి సరోజినీ దేవి తన కుమారుడైన కీర్తి తేజతో కలిసి తండ్రి ఇంటికి వచ్చింది.
సరోజినీ దేవి ఇంట్లోకి టీ తేవడానికి వెళ్లగా ఇదే అదనుగా చూసి కీర్తి తేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్ధన్ రావును 73 సార్లు పొడిచాడు. అరుపులు, కేకలు విన్న సరోజినీ దేవి పరుగున వచ్చి కుమారుడిని వారించబోయింది. ఆమె పైనా దాడిచేసి కత్తితో నాలుగు చోట్ల పొడిచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ జనార్ధన్ రావు మరణించగా, సరోజినీ దేవి, ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా కీర్తి తేజను పంజాగుట్టలో పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. కీర్తి తేజ డ్రగ్స్‌కు బానిస అయ్యాడని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. జనార్ధన్ రావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పలు దఫాలుగా రూ.40 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.40 కోట్లు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు స్వచ్చంధ సంస్థలకు కూడా విరాళాలు ఇచ్చారు. మిగతా మనవలను చూసినట్లుగా తనను చూడలేదని కసితో కీర్తి తేజ తన తాతయ్యను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.