అర్చకుడు రంగరాజన్‌పై దాడి..ఆరుగురు అరెస్ట్
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడి ఘటనలో ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ దాడి ఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ఈ ఉదయం ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు చేసి తరలించినట్లు తెలిపారు. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. 2022లో వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ను ప్రారంభించాడని.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశాడని చెప్పారు. రామరాజ్యంలో చేరితో రూ.20వేల జీతం ఇస్తానన్నానని ప్రచారం చేశాడని.. తణుకు, కోటప్పకొండలో వీరరాఘవరెడ్డి పర్యటించాడని.. రామరాజ్యంలో చేరిన వారిని యూనిఫామ్ కుట్టించుకోమన్నాడని వివరించారు.ఈ నెల 6న అందరూ యాప్రాల్‌లో కలిశారని.. రామరాజ్యం బ్యానర్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారని.. ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు తెలిపారు.
ఈ నెల 7న చిలుకూరు వచ్చి రంగరాజన్‌పై దాడి చేశారని చెప్పారు. మూడు వాహనాల్లో వచ్చి రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డారని.. రంగరాజన్‌పై దాడి కేసులో ఇప్పటి వరకు ఆరుగురు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురు అరెస్ట్ చేశామన్నారు. ప్రధాన నిందితుడు మణికొండలో ఉంటున్నాడని.. వీరరాఘవరెడ్డి స్వస్థలం తూగో జిల్లా అనపర్తి మండలం కొప్పవరమని చెప్పారు. ఈ నెల 7న వీరరాఘవరెడ్డి అనుచరులతో వచ్చి దాడికి పాల్పడ్డాడని.. 25 మంది నల్ల దుస్తుల్లో వచ్చి రంగరాజన్‌పై దాడి చేసినట్లుగా వివరించారు. తమకు ఆర్థికంగా సాయం చేయాలని డిమాండ్ చేశారని, రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని కోరారని.. డిమాండ్లకు అంగీకరించలేదన్న కారణంతో దాడికి పాల్పడ్డట్లుగా డీసీపీ పేర్కొన్నారు