రేవంత్.. నిన్ను కొడంగల్‌లో ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా
ఉప ఎన్నిక వస్తే పట్నం నరేందర్ రెడ్డి 50 వేల మెజార్టీతో గెలుస్తడు : కేటీఆర్
రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. సోమవారం కోస్గిలో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ''కోస్గి లో నేను రైతు నిరసన దీక్షకు వెళ్తున్నానా లేక కొడంగల్ లో ఉప ఎన్నిక వచ్చి రేవంత్ రెడ్డి ఓడిపోయి పట్నం నరేందర్ రెడ్డి గెలిచాక చేసే విజయోత్సవ ర్యాలీకి వచ్చనా అన్నట్టుగా ఉంది... రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలి.. 50 వేల ఓట్ల మెజారిటీతో పట్నం నరేందర్ రెడ్డి గెలవడం ఖాయం.. అలా గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా..'' అని చాలెంజ్ చేశారు. అనుముల అన్నదమ్ముల కోసం, అదానీ కోసం, అల్లుడి కోసమే కొడంగల్ నియోజకవర్గంలో సంవత్సరం నుంచి కురుక్షేత్ర యుద్దాన్ని తలపించేలా రేవంత్ రెడ్డి అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన మనుషులకు వేల కోట్ల విలువైన భూములను దోచిపెట్టడానికే లగచర్ల రైతులపై అక్రమ కేసులు బనాయించారని అన్నారు. అల్లుడికి కట్నం కింద ఇవ్వడానికే లగచర్ల భూములకు రేవంత్ సూటి పెట్టిండన్నారు.
కౌరవరాజు దుర్యోధనుడు లాగా సంవత్సర కాలంగా అరాచకాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఎదురొడ్డి కొడంగల్ ఆడబిడ్డలు అన్నదమ్ములు పోరాడుతున్నారని కొనియాడారు. సంవత్సర కాలంగా లగచర్ల, కొడంగల్ లో కురుక్షేత్ర యుద్ధం నడుస్తుందన్నారు. 14 నెల పదవీకాలంలో రైతులు ,మహిళలు, వృద్ధులు, యువత కోసం రేవంత్ రెడ్డి ఒక్క పని కూడా చేయలేదన్నారు. లగచర్ల భూములు తొండలు గుడ్లు పెట్టనవి అని రేవంత్ అబద్ధాలు చెప్పిండని.. ఎక్కడ చూసిన పచ్చని పంటపొలాలు ఉన్నాయని తెలిపారు. లంబాడి ఆడబిడ్డలు గడప దాటి బయటకు రారని.. అలాంటి వాళ్లు ఢిల్లీకి వెళ్లి న్యాయం కోసం అడిగేంత దుర్మార్గంగా రేవంత్ వ్యవహరించాడన్నారు. ఎకరానికి రూ.70 లక్షలు విలువ చేసే భూములను రూ.10 లక్షలకే గుంజుకోవాలని చూశారని.. ఎదురు తిరిగిన రైతులపై అక్రమంగా కేసులు పెట్టారని అన్నారు. కొడంగల్ రైతుల కోసం పట్నం నరేందర్ రెడ్డి జైలుకు పోయిండని.. అర్ధరాత్రి పోలీసులను ఊరు మీదికి పంపి లంబాడి ఆడబిడ్డలను రేవంత్ రెడ్డి అవమానించాడన్నారు. లగచర్ల జ్యోతి శివంగిలాగా ఢిల్లీలో లడాయి చేసిందని.. బంజారా ఆడబిడ్డల పోరాటంతోనే లగచర్ల రైతులకు న్యాయం జరిగిందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని తెలంగాణ సమాజం ఎదురు చూస్తుందన్నారు. అడ్డి మారి గుడ్డి దెబ్బలాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండన్నారు. రేవంత్ ది రేషం లేని బతుకు అని.. లంకెబిందెలు ఉన్నాయి అనుకొని అడ్డమైన హామీలు ఇచ్చానని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.
స్థానిక సంస్థలు అయిపోయాయంటే రేవంత్ రెడ్డి రైతుభరోసా పైసలు వెయ్యడని చెప్పారు. ఎకరానికి రూ.15 వేల సాయం చేస్తామని హామీ ఇచ్చి రూ.12 వేలే ఇస్తామంటున్నందుకు రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. రుణమాఫీపై తాను గతంలోనే చాలెంజ్ చేశానని.. ఇప్పుడు కొడంగల్ గడ్డ మీది నుంచి మళ్లీ సవాల్ చేస్తున్నానని అన్నారు. కల్వకుర్తి పక్కనే వెళ్దండలో ఉన్న రేవంత్ సొంత భూముల్లో ఫార్మా కంపెనీలు పెట్టాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారానికి తోడు బీఆర్‌ఎస్ పార్టీ ఒక్కో ఎకరానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం కలిపి ఇస్తుందన్నారు. ''తెలంగాణ నీ తాత జాగీర్ కాదు.. కేసీఆర్ ఉన్నంత కాలం ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే వాళ్ల పక్షాన కొట్లాడుతాం.. దామరగిద్ద తండా రైతుల కోసం కూడా పోరాడుతాం. రూ. 4,350 కోట్లతో కొడంగల్ కు నీళ్లు తెస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు కానీ ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు.. ఆయన మనుషులకు కమిషన్ ఇవ్వడానికి తప్ప కొడంగల్ ప్రజల కోసం ఏమాత్రం కాదు.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఇక్కడ 1.53 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే సౌలత్ ను కేసీఆర్ చేశారు.. 90 శాతం పనులు పూర్తయ్యాయి.. ఇంకో పది శాతం పనులు చేస్తే ప్రజలకు నీళ్లు వస్తయ్..'' అన్నారు.