రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింటే ఇస్తలేడు
11 సార్లు రేవంత్ ఢిల్లీకి పోయినా కలువలేదు : మాజీ మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒక్కసారి కాదు 11 సార్లు రేవంత్ ఢిల్లీకి పోయినా కనీసం కలువడానికి కూడా రాహుల్ ఇష్టపడలేదన్నారు. సోమవారం ధర్నా చౌక్‌లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు నిర్వహించిన ధర్నాలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఓటేయాలని సోనియాగాంధీతో లెటర్లు రాయించారని.. రాహుల్ గాంధీని తీసుకువచ్చి హామీలు ఇప్పించారని గుర్తు చేశారు. అయినా ప్రజలు నమ్మడం లేదని బాండ్ పేపర్‌లపై రాసి ఇచ్చారని తెలిపారు. ఓట్లప్పుడు నమ్మించి కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ స్పందించి ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఇప్పుడు ఎవరు ఎప్పుడు వచ్చి అరెస్టు చేస్తారో తెలియడం లేదన్నారు. ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికెట్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారని.. తీరా అధికారంలోకి వచ్చాక కేసులు పెట్టి బతుకుదెరువు లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి ఆర్‌ఎంపీలపై వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తాను ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు ట్రైనింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తే కొందరు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చారని.. ఆయన ఆర్‌ఎంపీల బతుకుదెరువు దెబ్బతినకుండా చూశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరి బతుకులు రోడ్డున పడ్డాయన్నారు. గీత కార్మికులపైనా అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, బిల్డర్లు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదన్నారు. రుణమాఫీపై ఏ ఊరిలో చర్చించేందుకైనా తాను సిద్ధమన్నారు. వానాకాలం రైతుబంధు సహా కేసీఆర్ ఇచ్చిన పథకాలన్ని ఎగ్గొట్టి రూ.16 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారని అన్నారు. ప్రతిరోజూ ప్రజలను కలుస్తానని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు సొంత నియోజకవర్గం కొడంగల్ వారిని కూడా కలవడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇది 30 పర్సెంట్ గవర్నమెంట్ అని ఎమ్మెల్యేలే చెప్తున్నారని అంటే ఏ పని కావాలన్నా 30 శాతం కమీషన్లు ఇవ్వాలని చెప్పారు. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉపన్యాసాలు దంచడం కాదు.. గల్లీకి పోదాం రా అని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. ఏడాదిలోనే రూ.1.47 లక్షల కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ పైసలు ఏం చేసిందో చెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టాలని.. జిల్లా పరిషత్ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.