కేసీఆర్ పాలన ఐఫోన్‌లా ఉంటే... రేవంత్ పాలన చైనా ఫోన్‌లా ఉంది : ఎమ్మెల్సీ కవిత
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ పాలన ఐఫోన్‌లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్‌లా ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చరిత్ర క్షమించదని కవిత హెచ్చరించారు. తన ఎండిపోయిన పోలను చూపిస్తూ ఓ రైతు బాధపడుతూ పెట్టిన మెసేజ్ చూస్తుంటే కళ్లలో నీళ్లొచ్చాయని అన్నారు. జగిత్యాలలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఎంత తేడా ఉందో ప్రజలే గమనిస్తున్నారు. బీసీ కుల సంఘాలతో సీఎం రేవంత్ చర్చలు జరపాలి. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలి. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారు.
బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయం. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్‌ను తప్పదోవపట్టించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు?. ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కేసీఆర్‌పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు. రైతులకు నీళ్లు ఇచ్చే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది’ అని కవిత అన్నారు.