ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్, హెచ్‌ఎఫ్‌ఎల్.. పేదలు, మధ్యతరగతికేనా?
వీటి విషయంలో ధనవంతులు, పెద్దవాళ్లకు మినహాయింపు ఉంటుందేమో? అని కేటీఆర్ సెటైర్
మూసీ సుందరీకరణ పేరుతో రిబర్‌బెడ్‌లో ఉన్న ఇండ్లను రేవంత్ ప్రభుత్వవం కూల్చివేసిన విషయం విదితమే. అయితే ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో అక్రమ నిర్మాణాలు ఉంటే ఎంతటి పెద్దవారినైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పడమే కానీ ఆచరణలో మాత్రం పేదలపై ఒకరకంగా పెద్దలపై మరో విధంగా వ్యవహరిస్తున్న తీరును విపక్షాలే కాదు, నిర్వాసితులు కూడా తప్పుపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా తీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్యతరగతికే వర్తిస్తాయా? ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్, హెచ్‌ఎఫ్‌ఎల్.. పేదలు, మధ్యతరగతికేనా? అని ప్రశ్నించారు. ధనవంతులు, పెద్దవాళ్లకు మినహాయింపు ఉంటుందేమో? అని సెటైర్ వేశారు.
నార్సింగి ప్రాంతంలో ఆదిత్య బిల్డర్స్ సంస్థ మూససీ నదిలో నిర్మాణాలను చేపడుతున్నది. మూసీ సుందరీకరణ అంటూ, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ల పేరిట పేద, మధ్య తరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడా నంస్థల నిర్మాణాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నిస్తూ పోస్ట్ చేసిన వీడియోకు కేటీఆర్ రీట్విట్ చేస్తూ వీటి విషయంలో ధనవంతులు, పెద్దవాళ్లకు మినహాయింపు ఉంటుందేమో? అని విమర్శించారు..