హైదరాబాద్‌లో ఫ్రెంచ్ కంపెనీ పెట్టుబడులు.. భవిష్యత్తులో టైర్ 2 పట్టణాలకు విస్తరణ

హైదరాబాద్‌లో టెలీపెర్ఫార్మెన్స్ సంస్థ కార్యకలాపాలు జూలై నెలలో ప్రారంభం కానున్నాయి.

Advertisement
Update:2023-06-26 15:18 IST

హైదరాబాద్ కేంద్రంగా మరో అంతర్జాతీయ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. ఫ్రెంచ్ డిజిటల్ సర్వీసెస్ కంపెనీ 'టెలీపెర్ఫార్మెన్స్' తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నది. హైదరాబాద్‌లో ప్రారంభించనున్న సంస్థలో 3000 మందికి పైగా అత్యంత నిపుణులైన వారికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్‌లో టెలీపెర్ఫార్మెన్స్ సంస్థ కార్యకలాపాలు జూలై నెలలో ప్రారంభం కానున్నాయి. అలాగే భవిష్యత్‌లో రాష్ట్రంలోని టైర్-2 పట్టణాల్లో కూడా టెలీపెర్ఫార్మెన్స్ సంస్థ తమ కార్యాలయాలను విస్తరించే అవకాశం ఉందని ఐటీ మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కంపెనీ విస్తరించడం ద్వారా మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం ఐటీ, ఐటీఈఎస్ రంగాలను కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా.. రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే సిద్దిపేట, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. రాబోయే రోజుల్లో నల్గొండ, నిజామాబాద్ ప్రాంతాల్లో కూడా ఐటీ టవర్లు పూర్తి చేయడం ద్వారా పలు అంతర్జాతీయ కంపెనీలు అక్కడ కార్యాలయాను ప్రారంభించే అవకాశం ఉన్నది. 


Tags:    
Advertisement

Similar News