తప్పిన ఘోరాలు.. ఒకేరోజు రెండు రైళ్లలో అగ్నికీలలు
ఈరోజు ఉదయం జరిగిన రెండు అగ్ని ప్రమాద ఘటనలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ ఘటనలకు అసలు కారణాలేంటో కనిపెట్టే పనిలో పడింది. విచారణ ప్రారంభించినట్టు తెలిపారు రైల్వే శాఖ అధికారులు.
ఒకేరోజు రెండు రైళ్లకు ఘోర ప్రమాదాలు తప్పాయి. అందులో ఒకటి తెలంగాణ ఎక్స్ ప్రెస్ కాగా, మరొకటి ఉద్యాన్ ఎక్స్ ప్రెస్. రెండు రైళ్లూ అగ్ని ప్రమాదాలకు గురికావడం ఇక్కడ కామన్ పాయింట్. ప్రాణ నష్టం జరక్కపోయినా ప్రయాణికులు భయంతో హడలిపోయారు. రైలు దిగి పరుగులు పెట్టారు. గంటల వ్యవధిలో జరిగిన ఈ రైలు ప్రమాదాలు కలకలం సృష్టించాయి.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ కి మహారాష్ట్రలో ఘోర ప్రమాదం తప్పింది. ఈరోజు ఉదయం రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. కారణాలు ఇంకా బయటకు రాలేదు. ఎస్-2 బోగీలో మంటలు చెలరేగగా ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రైలులో పొగలు చూసి నాగ్ పూర్ సమీపంలో దాన్ని ఆపివేశారు లోకో పైలట్. రైలు ఆగిన వెంటనే ప్రయాణికులు భయంతో కిందకు దూకి పరుగులు పెట్టారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ లో మంటలు..
ముంబై - బెంగళూరు ఉద్యాన్ ఎక్స్ ప్రెస్ లో కూడా మంటలు చెలరేగాయి. రైలు బెంగళూరు స్టేషన్ కి చేరుకున్న తర్వాత ప్రయాణికులందరూ దిగిపోయారు. ఆ తర్వాత రెండు ఏసీ కోచ్ లలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలముకోవడంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఏసీ బోగీలలో సీట్లు తగలబడ్డాయి. రెండు బోగీలను వేరు చేశారు.
ఈరోజు ఉదయం జరిగిన రెండు అగ్ని ప్రమాద ఘటనలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ ఘటనలకు అసలు కారణాలేంటో కనిపెట్టే పనిలో పడింది. విచారణ ప్రారంభించినట్టు తెలిపారు రైల్వే శాఖ అధికారులు.