ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు.. 2 బోగీలు బూడిద
Falaknuma Express Fire Accident: ఈ మంటలు మిగతా బోగీలకు కూడా అంటుకున్నాయి. దీంతో సిబ్బంది రైలులోనుంచి ప్రయాణికులందర్నీ కిందకు దించేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
భారతీయ రైల్వే ఇటీవల తరచూ వార్తల్లోకెక్కుతోంది. ఒడిశా దుర్ఘటన తర్వాత రైలు ప్రయాణాలంటే భయపడిపోతున్నారు ప్రజలు. ఆ తర్వాత అక్కడక్కడా జరిగిన చిన్న చిన్న సంఘటనలు కూడా రైలు ప్రమాదాలంటేనే భయపడే పరిస్థితులు కల్పించాయి. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లోని రెండు బోగీలు తగలబడ్డాయి. షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి కాలి బూడిదయ్యాయి.
యాదాద్రి జిల్లాలో..
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తోంది. పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్యలో కొన్ని బోగీలనుంచి పొగలు వస్తున్నట్టు సిబ్బంది గమనించారు. వెంటనే రైలుని అక్కడే ఆపివేశారు. పొగలు వస్తున్న బోగీల నుంచి ప్రయాణికుల్ని కిందకుదించారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు కానీ సాధ్యం కాలేదు. 2 బోగీలు కళ్లముందు తగలబడిపోయాయి. కాలి బూడిదయ్యాయి.
మిగతా బోగీలకు ప్రమాదం..
ఈ మంటలు మిగతా బోగీలకు కూడా అంటుకున్నాయి. దీంతో సిబ్బంది రైలులోనుంచి ప్రయాణికులందర్నీ కిందకు దించేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈలోగా కొంతమంది ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు వెదుక్కున్నారు. రోడ్డు మార్గంలో తమ గమ్యస్థానాలకు పయనమయ్యారు.