డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్.. కాంగ్రెస్ మొదటి తాయిలం

సరిగ్గా లోక్ సభ ఎన్నికల వేళ నిరుద్యోగులకు భారీ తాయిలం ఇవ్వాలని చూస్తోంది కాంగ్రెస్. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని కసరత్తులు చేస్తున్నారు.

Advertisement
Update:2024-01-24 10:43 IST

అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడవకముందే డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ వేస్తే అందులో రాజకీయ కోణం ఏముంటుందని అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ వ్యూహం అది కాదు, లోక్ సభ ఎన్నికలకోసం వేసిన భారీ స్కెచ్. తెలంగాణలో గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్ట్ ల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్నికల కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటికి అదనంగా మరో 5వేల పోస్ట్ లను జతచేయబోతోంది. ఈ మెగా డీఎస్సీ క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. సరిగ్గా లోక్ సభ ఎన్నికల వేళ నిరుద్యోగులకు భారీ తాయిలం ఇవ్వాలని చూస్తోంది కాంగ్రెస్. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని కసరత్తులు చేస్తున్నారు.

డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ కోసం విద్యాశాఖ వివరాలు సేకరిస్తోంది. ఈ ఏడాది తెలంగాణలో మొత్తం 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయబోతున్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు మొదలవుతాయి. ఆయా ఖాళీలను కూడా అనుబంధ నోటిఫికేషన్లో చూపిస్తారు. ప్రత్యేక అవసరాల పిల్లల(CWSN) బోధించేందుకు దాదాపు 1,500 స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతుల విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్‌ అత్యథికంగా 370 మంది టీచర్లు, మేడ్చల్‌లో-260, ఖమ్మం-240, రంగారెడ్డి 210, సంగారెడ్డి-200, నిజామాబాద్‌లో-190 మంది టీచర్లు పదవీ విరమణ చేయబోతున్నారు. మార్చితో మొదలై, జూన్ నాటికి ఈ రిటైర్మెంట్లు పూర్తవుతాయి. రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1.22 లక్షలు కాగా... ప్రస్తుతం 1.03 లక్షల మంది పనిచేస్తున్నారు. మొత్తం 10వేలకు పైగా ఖాళీలతో మెగా డీఎస్సీకి కాంగ్రెస్ ప్రభుత్వంకసరత్తులు చేస్తోంది. గతంలో డీఎస్సీకి అప్లై చేసుకున్నవారితోపాటు కొత్తగా CWSN పోస్ట్ లకు అప్లికేషన్లు తీసుకుని ఒకేసారి పరీక్ష నిర్వహించే అవకాశముంది. 

Tags:    
Advertisement

Similar News