సైబ‌రాసురుల‌కు చెక్‌.. - సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల స‌రికొత్త రికార్డు

ఆన్‌లైన్‌లో జూదం, క్యాసినో, గేమింగ్ ఆడితే డ‌బ్బు బాగా సంపాదించ‌వచ్చ‌ని నిందితులు ఆన్‌లైన్‌లో ప్ర‌క‌ట‌న‌లు ఇస్తారు. వాటిపై క్లిక్ చేయ‌గానే వారు రూపొందించిన న‌కిలీ యాప్ వెబ్‌సైట్‌లోకి వెళుతుంది.

Advertisement
Update:2023-01-31 12:22 IST
సైబ‌రాసురుల‌కు చెక్‌.. - సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల స‌రికొత్త రికార్డు
  • whatsapp icon

సైబ‌రాసురుల‌కు చెక్ పెట్టి ఏకంగా వారి ఖాతాల్లోని రూ.41 కోట్ల‌ను జ‌ప్తు చేసిన ఘ‌న‌త సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు సాధించారు. సాధార‌ణంగా సైబ‌ర్ క్రైమ్ కేసుల్లో నిందితుల‌ను గుర్తించ‌డ‌మే అత్యంత క‌ష్ట‌త‌రం. అలాంటిది కేసును ఛేదించి 8 మంది నిందితుల‌ను అరెస్టు చేసి.. వారి బ్యాంకు ఖాతాల్లోని రూ.41 కోట్ల న‌గ‌దును జ‌ప్తు చేయ‌డం నిజంగా స‌రికొత్త రికార్డుగానే చెప్పాలి. ఒక సైబ‌ర్ క్రైమ్ కేసులో ఇంత భారీ మొత్తంలో సొమ్ము జ‌ప్తు చేయ‌డం దేశంలో ఇదే ప్ర‌థ‌మం కావ‌డం విశేషం.

ఆన్‌లైన్ గేమ్‌ల పేరుతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మోసాల‌కు పాల్ప‌డుతున్న అంత‌ర్జాతీయ ముఠాను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉండే కొంద‌రు సైబ‌ర్ నేర‌గాళ్ల క‌నుస‌న్న‌ల్లో ఈ ఆన్‌లైన్ గేమింగ్ దందా న‌డుస్తోంది. గ‌తంలో న‌కిలీ కాల్ సెంట‌ర్ల‌లో టెలీ కాల‌ర్లుగా ప‌నిచేసిన వ్య‌క్తుల‌ను వీరు ఆన్‌లైన్ గేమింగ్ దందా కోసం ఒప్పించారు. త‌మ‌తో క‌లిస్తే క‌మీష‌న్లు ఇస్తామ‌న‌డంతో వారు అంగీక‌రించారు. బెంగ‌ళూరుకు చెందిన మోహిన్ పాషా, ఉత్త‌రాఖండ్‌లోని రుద్రాపూర్‌, హ‌వ‌ల్దాని, నైనిటాల్‌కు చెందిన క‌ర‌ణ్ అరోరా, సంజీవ్‌కుమార్‌, గోకుల్ సింగ్ కోరంగా, ఢిల్లీలోని ల‌క్ష్మీన‌గ‌ర్‌కు చెందిన క‌ర‌ణ్ మ‌ల్హోత్రా, సోనూ లోకేష్‌, మోహిత్‌కుమార్‌, దినేశ్‌సింగ్ వీరిలో ఉన్నారు. వీరంతా నిరుద్యోగులు కావ‌డంతో వెంట‌నే వారితో క‌లిసి ప‌నిచేసేందుకు అంగీక‌రించారు.

ఆన్‌లైన్‌లో జూదం, క్యాసినో, గేమింగ్ ఆడితే డ‌బ్బు బాగా సంపాదించ‌వచ్చ‌ని నిందితులు ఆన్‌లైన్‌లో ప్ర‌క‌ట‌న‌లు ఇస్తారు. వాటిపై క్లిక్ చేయ‌గానే వారు రూపొందించిన న‌కిలీ యాప్ వెబ్‌సైట్‌లోకి వెళుతుంది. ఎవ‌రైనా ఈ గేమ్‌లు ఆడితే వారికి తొలుత రూ.వేల‌ల్లో లాభాలు ఇస్తారు. సంబంధిత సొమ్మును వెబ్‌సైట్‌లో, యాప్ వ్యాలెట్‌లో జ‌మ చేస్తారు. లాభాలు వ‌స్తున్నాయ‌ని వ‌రుస‌గా పెట్టుబ‌డి పెడితే మోసం చేయ‌డం ప్రారంభిస్తారు. భారీ పెట్టుబ‌డి పెడితే ఓడిపోయిన‌ట్టు చూపించి.. మోసం చేస్తారు. బాధితులు మోస‌పోయిన సొమ్ములో నిందితుల‌కు క‌మీష‌న్ వ‌స్తుంది.

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండ‌లానికి చెందిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అనే యువ‌కుడు గేమ్‌కింగ్ 567.కామ్ వెబ్‌సైట్‌లో క‌ల‌ర్ ప్రిడిక్ష‌న్ గేమ్ ఆడుతూ ఏకంగా రూ.98.47 ల‌క్ష‌లు పోగొట్టుకున్నాడు. దీనిపై అత‌ను పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ద‌ర్యాప్తు చేసిన పోలీసులు అత‌ని ఖాతా నుంచి సొమ్ము ఫోన్ పైసా సంస్థ ఖాతాకు చేరిన‌ట్టు గుర్తించారు. అక్క‌డి నుంచి నిందితుల‌కు చెందిన బ్యాంకు ఖాతాకు ఆ సొమ్ము బ‌దిలీ అయింది. మ‌రింత లోతుగా పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా ఢిల్లీ కేంద్రంగా ఈ దందా సాగుతున్న‌ట్టు తేలింది. నిందితుల‌పై నిఘా పెట్టి అక్క‌డ ఒకరిని అరెస్టు చేశారు. అనంత‌రం రెక్కీ చేసి మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు ఖాతాల నిర్వ‌హ‌ణ‌లో తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద‌ల నుంచి ఆధార్ స‌హా కొన్ని గుర్తింపు కార్డుల‌ను సేక‌రిస్తున్నారు. వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు నిర్వ‌హిస్తున్నారు. ఖాతా ఇత‌రుల‌దే అయినా.. డెబిట్ కార్డులు, ఆన్‌లైన్ లావాదేవీల‌ను నిందితులే నిర్వ‌హిస్తున్నారు. లావాదేవీల‌కు వినియోగించినందుకు అస‌లైన ఖాతాదారుల‌కు ప్ర‌తినెలా కొంత క‌మీష‌న్ కింద చెల్లిస్తున్నారు. ఇలా వివిధ ప్రాంతాల‌కు 238 మంది బ్యాంకు ఖాతాల‌ను వారు వినియోగిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News