గుండాలతో కొట్టించుడు.. చిల్లరగాళ్లతో తిట్టించుడు మానండి

సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు హితవు

Advertisement
Update:2025-01-12 18:09 IST

గుండాలతో కొట్టించుడు.. చిల్లరగాళ్లతో తిట్టించుడు మానాలని సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు హితవు చెప్పారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ సీఎం అయ్యాక రైతులను అడుగడుగునా నట్టేట ముంచారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు కూడా తప్పారని అన్నారు. పది పంటలకు బీమా ఇస్తామని ఒకే పంటకే ఇస్తున్నారని.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని రైతులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని అన్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయడం చేతగాక ప్రజల దృష్టి మరల్చడానికి హింసా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సంక్షేమంలో విఫలవమవడంతోనే హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. భువనగిరి ఘటనలో దాడి చేస్తున్న వారిని పోలీసులే ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తుందన్నారు. సీఎం, హోం మంత్రిగా ఉన్న రేవంత్‌ రెడ్డినే హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కౌశిక్‌ రెడ్డి, అల్లు అర్జున్‌ ఇంటిపై దాడులు, బీఆర్‌ఎస్‌, బీజేపీ ఆఫీసులపై దాడులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని.. ఆయన మౌనమే ఇది నిజమని చెప్తుందని అన్నారు.


 



రాష్ట్రపతి పాలన పెట్టాలే

రేవంత్‌ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన ప్రయోజనాలే ముఖ్యమయ్యాయని అన్నారు. అందుకే తెలంగాణను రావణకాష్టంలా మారుస్తున్నాడని మండిపడ్డారు. తమ ఓపికను బలహీనత అనుకోవద్దని హెచ్చరించారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రతిపక్ష నేతలను కట్టడి చేయడానికే పోలీసులు ప్రాధాన్యత ఇస్తుండటంతోనే రాష్ట్రంలో క్రైమ్‌ రేట్‌ పెరిగిందన్నారు. అవసరమైతే రాష్ట్రపతిపాలన పెట్టి అయినా సరే శాంతిభద్రతలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మత కలహాలు పెరిగాయని.. క్రైమ్‌ స్ట్రైక్‌ రేట్‌ 23 శాతం పెరిగిందన్నారు.

రైతులను ముంచి సంబరాలా?

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నట్టేట ముంచారని.. అయినా సిగ్గు లేకుండా సంబరాలు చేయమంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు రాహుల్‌ నుంచి రేవంత్‌ రెడ్డి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. దీనిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. ఒక్కో రైతును ఈ ప్రభుత్వం ఎకరానికి రూ.9 వేల చొప్పున ముంచుతోందన్నారు. వానాకాలం రైతుభరోసా గుండు సున్నా పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు తుట్టి పెట్టి సాయాన్ని తక్కువ చేసి ఇవ్వాలని చూస్తోందన్నారు. ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్‌ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. కౌలు రైతులకు భరోసా ఇస్తామని పెద్ద నోటితో ఎన్నికలకు ముందు ప్రచారం చేశారని.. ఇప్పుడు వాళ్ల ముచ్చటే లేదన్నారు. రాష్ట్రంలో కోటి మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారని.. వాళ్లల్లో 90 లక్షల మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు అందకుండా ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. ఎకరం భూమి ఉన్న రైతులను కూడా కూలీలుగా గుర్తించి వారికి కూడా రూ.12 వేల సాయం ఇవ్వాలన్నారు. రైతు భరోసా ప్రతిపాదనలు చేసేప్పుడు ఈ ప్రభుత్వానికి కనీసం సోయి లేకుండా పోయిందన్నారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోళ్లెవరూ ఇట్లా చేయరని అన్నారు. ఇకనైనా బుకాయింపులు మాని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News