బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అరెస్ట్
బీఆర్ఎస్ మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ నాయకులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులకు నిరసన వ్యక్తం చేస్తూ.. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందుస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నుంచి భువనగిరి వెళ్తుండగా.. ఘట్కేసర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, మాజీమంత్రికి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. తాను పార్టీ కార్యాలయానికి పరిశీలనకు మాత్రమే వెళుతున్నానని, ఆందోళన చేసేందుకు కాదని పోలీసులకు జగదీష్ రెడ్డి తెలిపారు. దీనికి పోలీసులు మీరు వెళ్లడం పట్ల ఎటువంటి సమస్య లేదని, మీ వెంట జనం రావడంతో కొత్త సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. దయచేసి తమకు సహకరించాలని చెప్పి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.