రైతులను దగా చేస్తున్న రేవంత్ సర్కార్
రైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలని, ప్రభుత్వం మెడలు వంచి రావాల్సిన పథకాలు సాధిద్దామన్న మాజీ మంత్రి
రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకొనే కాంగ్రెస్ రైతులను దగా చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. భోగ భాగ్యాలను అందించే భోగి పండుగ, కొత్త కాంతులను తెచ్చే సంక్రాంతి పండుగ, కనుమ పండుగలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మాట తప్పినందుకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మెడలు వంచి రావాల్సిన పథకాలు సాధిద్దామని అన్నారు. ఎకరంలోపు భూమి ఉంటే వారిని కూలీలుగా గుర్తించి రూ. 12 వేలు ఇవ్వాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో మోసం చేసిందని మండిపడ్డారు. రైతు భరోసా ఇప్పుడైతే రూ. 10 వేలు, తాము అధికారంలోకి వస్తే రూ. 15 వేలు అని మోసం చేశారు. వ్యవసాయ కూలీలందరికీ రూ. 12 వేలు ఇస్తానని మోసం చేశారు. అన్నిపంటలకు బోనస్ ఇస్తామని మోసం చేశారు. పంటలకు బీమా అని మోసం చేశారు. రైతు రుణమాఫీ అందరికీ చేస్తానని మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి పథకంలో అయితే ఎగవేతలు.. లేకపోతే కోతలు అని ఎద్దేవా చేశారు.
రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ అడుగడుగునా రైతులను దగా చేస్తున్నది. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ప్రభుత్వ చేతలు మాత్రం గడప దాటడం లేదు. మహబూబ్ నగర్ జిల్లాలో రైతు విజయోత్సవాలలో 2750 కోట్లు రుణమాఫీ కోసం ముఖ్యమంత్రి విడుదల చేశారు. రెండు నెలల కిందట రైతు రుణమాఫీ కోసం ఇచ్చిన చెక్కు ఇప్పటివరకు ఇంకా సంగారెడ్డి రైతులకు చేరలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే దిక్కు లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. నవంబర్ 30న ముఖ్యమంత్రి చెక్కిస్తే ఇప్పటివరకు రైతులకు రుణమాఫీ కాలేదు.
ఎన్నికల్లో డమ్మీ హామీలు ఇచ్చినట్టు ముఖ్యమంత్రి అయినంక కూడా డమ్మీ చెక్కులు ఇస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? రైతులను ప్రజలను మోసం చేయడమే మీ లక్ష్యం. మీరు ఇచ్చిన చెక్కుకు ఈరోజు వరకు ఎందుకు రైతుల ఎకౌంట్లో డబ్బులు పడలేదు? అని నిలదీశారు.అందరికీ రుణమాఫీ అని కొందరికి మాత్రమే చేశారు. రెండు లక్షల పైన రుణమున్న రైతులు ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం ఆ పైన ఉన్న అప్పును కట్టారు.ఇంకా వారికి రుణమాఫీ కాలేదు. పంటల బీమా విషయంలో కూడా రైతులను దగా చేశారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఉపాధి హామీ కూలీలను కూడా దగా చేస్తున్నారు. అడుగడుగునా రైతులను మోసం చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వమని వారు చెప్పకనే చెప్తున్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఎన్నికల్లో రైతులకు అరిచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల తర్వాత మొండి చేయి చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళుతున్న అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.. పోయినసారి ఎన్నికల ముందు మీరందరూ ఊర్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. మనమందరం వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం . మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు రైతులకు రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని గ్రహించండి. రుణమాఫీ కానీ రైతుల బాధలు అడిగి తెలుసుకోండి, బోనస్ విషయంలో రైతులను ఎలా మోసం చేశారో అడగండి. రైతు భరోసా ఎగ్గొట్టిండు అన్న విషయాన్ని తెలుసుకోండి. రైతులతో మాట్లాడి చర్చించి ఈ వాస్తవాలను తెలుసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
గోబెల్స్‌ను మించిపోతున్న భట్టి విక్రమార్క
బీఆర్‌ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇవ్వండి అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గోబెల్స్‌ను మించిపోతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అప్పుల విషయంలో అబద్ధాలు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు కేవలం నాలుగు లక్షల 17వేల కోట్లు మాత్రమే.నిన్న నాగర్ కర్నూల్ లో భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కాలేదు అని, ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు అని అబద్ధాలు మాట్లాడాడు. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలో 4000 కోట్లు ఖర్చుపెట్టి ఆరు లక్షల 50 వేల ఎకరాలకు నీళ్లు అందించాం. ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు అని అంటే ఆరున్నర లక్షల ఎకరాలు నీళ్లు అందుతున్న రైతులు ఏమనుకోవాలి భట్టి గారు? అని ప్రశ్నించారు. మీ హయాంలో పడావు బడ్డ భూములకు నీళ్లు ఇచ్చాం. తుమ్మిళ్ల లిఫ్ట్ పెట్టి 40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.చెక్ డ్యాములు, చెరువులు బాగు చేసి నెట్టెంపాడు,బీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తిచేసి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. మీ విశ్వసనీయత మీరే తగ్గించుకున్న వారు అవుతారు భట్టి గారు. ప్రజల్లో గౌరవం కోల్పోతారు. బహిరంగ చర్చకు సిద్ధం. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మధిరకు రమ్మంటారా,సెక్రటేరియట్ కి రమ్మంటారా? మీ ప్రగతి భవన్ కి రమ్మంటారా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు కదా లెక్కలతో సహా నేను వస్తా మీరు సిద్ధమా?