ఎన్నికల టైంలో ఫ్రాడ్స్ జరిగితే ఇలా కంప్లెయింట్ చేయొచ్చు!

ఎన్నికలు సజావుగా జరిగేందుకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా అడ్డుకునేందుకు ఎలక్షన్ కమీషన్.. ‘సీ–విజిల్’ అనే యాప్‌ను రూపొందించింది.

Advertisement
Update:2023-10-14 08:00 IST

ఎన్నికల టైంలో ఫ్రాడ్స్ జరిగితే ఇలా కంప్లెయింట్ చేయొచ్చు!

తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. అయితే ఎన్నికల వేళ ఓటర్లు మభ్య పెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. కొన్నిచోట్ల ఎన్నికల నిబంధనలను కూడా ఉల్లంఘిస్తుంటారు. ఇలాంటివి కంట పడినప్పుడు జస్ట్ ఒక ఫోటో తీసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు. అదెలాగంటే..

ఎన్నికలు సజావుగా జరిగేందుకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా అడ్డుకునేందుకు ఎలక్షన్ కమీషన్.. ‘సీ–విజిల్’ అనే యాప్‌ను రూపొందించింది. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా అడ్డుకోవడంలో ప్రతీ పౌరుడిని భాగస్వామ్యం చేసేందుకు ఈ యాప్‌ను రూపొందించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.

ఈ యాప్ ద్వారా ప్రతీ పౌరుడు తన పరిధిలో జరిగే చట్ట ఉల్లంఘనలను కంప్లెయింట్ చేయొచ్చు. అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తిస్తే నేరుగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఇలా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటారు. కంప్లెయింట్ అందిన 100 నిమిషాల్లో ఎన్నికల విభాగం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటుందని అధికారులు ప్రకటించారు.

ఎలా చేయాలంటే..

చట్ట ఉల్లంఘన కార్యక్రమాలను కంప్లెయింట్ చేయాలనుకుంటే ముందుగా ఫోన్‌లో ‘సీ–విజిల్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్టు మీకు తెలిస్తే రహస్యంగా ఫోటోలు తీయాలి. ఉదాహరణకు ఓటర్లను మభ్య పెట్టడం, బెదిరించడం, అక్రమంగా నగదు, మద్యం వంటివి పంపిణీ చేయడం వంటివి గమనిస్తే.. వెంటనే వాటిని ఫోటో లేదా వీడియో తీసి వాటిని యాప్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. వీడియో నిడివి రెండు నిముషాల వరకూ ఉండొచ్చు. అలాగే కంప్లెయింట్ చేసేటప్పుడు ఫోన్‌లో జీపీఎస్ ఆన్‌లో ఉండాలి. కంప్లెయింట్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. ‘సీ–విజిల్‌’ యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన కంప్లెయింట్స్‌ను ఎన్నికల సంఘం వెంటనే పరిశీలిస్తుంది. వంద నిమిషాల్లోనే చర్యలు ప్రారంభిస్తుంది. అలాగే యాప్‌తోపాటు ‘1800 11 1950’ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి కూడా కంప్లెయింట్ చేయొచ్చు.

Tags:    
Advertisement

Similar News