ఎయిర్ పోర్టుల్లో మళ్లీ కరోనా పరీక్షలు.. మాస్క్ తప్పనిసరి

Coronavirus in Hyderabad: అనుమానం ఉన్నవారికి మాత్రమే శంషాబాద్ విమానాశ్రయంలో కొవిడ్ పరీక్షలు జరుపుతున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి, ర్యాండమ్ గా ప్రతి 100మందిలో ఇద్దరికి పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు అధికారులు.

Advertisement
Update:2023-04-01 22:22 IST

దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రోజువారీ గణాంకాలు ప్రజల్ని అలర్ట్ చేస్తున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య పెరగడం, అక్కడక్కడా ఒకటీ అరా కరోనా మరణాలు కూడా నమోదు కావడంతో అధికారులు, ప్రజలు అప్రమత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో తిరిగి కొవిడ్ నిర్థారణ పరీక్షలు మొదలు పెట్టారు.

అందరికీ కాదు..

అనుమానం ఉన్నవారికి మాత్రమే శంషాబాద్ విమానాశ్రయంలో కొవిడ్ పరీక్షలు జరుపుతున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి, ర్యాండమ్ గా ప్రతి 100మందిలో ఇద్దరికి పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు అధికారులు. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల ద్వారా శంషాబాద్‌ కు వస్తున్న ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం థర్మల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి 100 మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో అనుమానం ఉన్న ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు.

సర్టిఫికెట్ అవసరం లేదు..

గతంలో లాగా కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే ప్రయాణం అనే పరిస్థితి ఇంకా రాలేదన్నారు అధికారులు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్న ప్రయాణికులకు ప్రస్తుతం కొవిడ్‌ పరీక్షలు, ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. కరోనా లక్షణాలుంటే మాత్రం విధిగా మాస్క్‌ ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు.

ఇక మెల్లమెల్లగా మాస్క్ వాడకం జనాల్లో పెరుగుతోంది. ఆస్పత్రులకు వచ్చేవారు కచ్చితంగా మాస్క్ లు ధరిస్తున్నారు. ప్రజా రవాణా వాహనాలు ఉపయోగించుకునే ప్రయాణికులు కూడా మాస్క్ లు ధరించే కనపడుతున్నారు. మాస్క్ లు ధరించండి, లేకపోతే జరిమానా కట్టండి.. అని ప్రభుత్వం హెచ్చరించడానికి ముందే ప్రజల్లో అప్రమత్తత రావడం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం. 

Tags:    
Advertisement

Similar News