హతవిధీ.. జానారెడ్డి తనను తాను బుజ్జగించుకోవల్సిందేనా..?
టికెట్లు దక్కనివారిని బుజ్జగించే కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న జానారెడ్డి ఇప్పుడు తనను తానే బుజ్జగించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా ప్రకటించిన కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డికి తగిన గౌరవం దక్కనట్లే కనిపిస్తోంది. తన కుమారులు రఘువీర్‌రెడ్డికి మిర్యాలగూడ, జయవీర్‌రెడ్డికి నాగార్జునసాగర్ టికెట్లు కావాలని గట్టిగా పట్టుబట్టారు. కొడుకుల కోసమే తాను పోటీకి రాలేదని కూడా అన్యాపదేశంగా చెప్పారు. పార్టీ హైకమాండ్‌లో తనకున్న పట్టుతో కొడుకులిద్దరికీ టికెట్లు తెచ్చుకోగలననే ధీమాతో ఉన్నారు..
ప్రస్తుతానికి ఒకటే ఇచ్చారు..
అయితే తాజా జాబితాలో జయవీర్‌రెడ్డికి నాగార్జునసాగర్ టికెట్ ప్రకటించారు. కానీ, మిర్యాలగూడలో రఘువీర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలన్న అభ్యర్థనను పట్టించుకోలేదు. రెండో జాబితాలో ఇస్తారులే అని జానారెడ్డి వర్గంలో కొందరు సర్దిచెప్పుకుంటుంటే.. ఇచ్చేవారయితే తొలి జాబితాలోనే ఇచ్చేవారు అని మరికొందరు సందేహం లేవనెత్తుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తనకంటే జూనియర్ నేత అయిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆయన భార్య పద్మావతికి టికెట్లు ఇచ్చి జానారెడ్డి కుటుంబంలో ఒకటే టికెట్ కేటాయించటం కాస్త ఆలోచించాల్సిన విషయమే.
నిన్నగాక మొన్న పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి, ఆయన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్లు కేటాయించారు. కానీ, జానారెడ్డి కుటుంబానికి ఒకటే ఇచ్చారు. టికెట్లు దక్కనివారిని బుజ్జగించే కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న జానారెడ్డి ఇప్పుడు తనను తానే బుజ్జగించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు.