అసెంబ్లీలో రేవంత్‌ Vs కేసీఆర్‌.. బడ్జెట్‌ సమావేశాలు ఎప్పుడంటే?

బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య మాటల యుద్ధం చూసేందుకు జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Update:2024-02-03 20:42 IST

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 8 నుంచి బడ్జెట్‌ సమావేశాలు జ‌ర‌గ‌నున్న‌ట్లు సమాచారం. తొలిరోజు గవర్నర్‌ ప్రసంగంతో బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతాయి. 9న గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. 10న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 11న ఆదివారం సెలవు. 12 నుంచి బడ్జెట్‌ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై రేపు మంత్రివర్గం చర్చించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలోనూ ఇదే తరహా బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని చూస్తోంది రేవంత్ సర్కారు.

బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య మాటల యుద్ధం చూసేందుకు జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆరోగ్య కార‌ణాల రీత్యా కేసీఆర్ హాజ‌రుకాలేదు. కానీ, ఇప్పుడు ఆయన కోలుకున్నారు. మొన్నే చేతికర్ర సాయంతో అసెంబ్లీకి వచ్చి గజ్వేల్ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో బడ్జెట్‌ సమావేశాలకు కేసీఆర్‌ తప్పక వస్తారని రేవంత్‌ సర్కారును ఆటాడుకుంటార‌ని BRS వర్గాల్లో చర్చ నడుస్తోంది.

రేవంత్‌ రెడ్డి పాలనలో లోటు పాట్లపై ఇప్పటికే మాజీమంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఎప్పటికప్పుడు గలమెత్తుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా గత ప్రభుత్వం హయంలో జరిగిన అవకతవకలపై విమర్శల దాడి పెంచుతున్నారు. అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 2 నెలలు కావొస్తున్నా ఇప్పటిదాకా కేసీఆర్‌ నుంచి ఎలాంటి విమర్శ గానీ, స్పందన గానీ రాలేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలకు కేసీఆర్‌ హాజరై రేవంత్‌రెడ్డిపై ఎలాంటి విమర్శలు చేస్తారనేది ఉత్కంఠగా మారింది. అలాగే తెలంగాణ వచ్చాక రాష్ట్రానికి రెండు టర్ములు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. పదేళ్లు సభకు ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే వచ్చారు. కానీ, మొదటిసారి ప్రతిపక్ష నాయకుడిగా సభకు వస్తుండటం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కేసీఆర్‌ కోలుకోవడం, బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్ధం అవుతుండటంతో తెలంగాణ రాజకీయాలు మరింత రంజుగా మారాయి.

Tags:    
Advertisement

Similar News