వరద బాధితులకు వెయ్యి కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించిన కేసీఆర్
వరద బాధితులకు నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించారు తెలంగాణ సీఎం కెసిఆర్. భద్రాచలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులు ఇళ్ళు నిర్మించుకోవడానికి వెయ్యి కోట్ల ఆర్ధిక సాయాన్ని ఆయన ప్రకటించారు.
వరద బాధితులకు నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించారు తెలంగాణ సీఎం కెసిఆర్. భద్రాచలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులు ఇళ్ళు నిర్మించుకోవడానికి వెయ్యి కోట్ల ఆర్ధిక సాయాన్ని ఆయన ప్రకటించారు. ఆదివారం ఆయన వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం బాధితులను పరామర్శించారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో బాధితులు శాశ్వత గృహాలు నిర్మించుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. గోదావరి నది వద్ద గంగమ్మ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన కేసీఆర్.. బాధితులకోసం భద్రాచలం హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని విజిట్ చేసి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. వీరికి అందుతున్న సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో భద్రాచలవాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనవలసి ఉందన్నారు. ఇందుకు త్వరలో ఓ కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తామని ఆయన చెప్పారు. మొదట రోడ్డు మార్గం ద్వారా కేసీఆర్.. ములుగు జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. ఏటూరునాగారం లోని రామన్నగూడెం వద్ద పుష్కర్ ఘాట్ ను విజిట్ చేసిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంటువ్యాధులు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ కు సూచించారు.
ముంపు ప్రాంతాల్లో ఉంటున్నవారికి రెండు నెలలపాటు 20 కేజీల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని, తక్షణ సాయంగా ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్ధిక సాయం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 15 రోజులపాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. భద్రాచలం పుణ్య క్షేత్రాన్ని ముంపు నుంచి కాపాడి అభివృద్ధి చేస్తాం.. సీతమ్మ పర్ణశాలను కూడా భారీ వరదల నుంచి పరిరక్షించేందుకు కృషి చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. ఏమైనా.... భారీ వర్షాలు, వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణమని చెబుతున్నారని, గోదావరి పరీవాహక ప్రాంతంపై క్లౌడ్ బరస్ట్ కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలున్నాయని ఆయన చెప్పారు. విదేశాలకు చెందిన కొందరు ఈ కుట్రలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోందన్నారు. లోగడ లడఖ్, లేహ్, ఉత్తరాఖండ్ లో ఇలా జరిగినట్టు ఆయన చెప్పారు.కాగా వరదలకు గురైన భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లాలకు అత్యవసరంగా వినియోగించేందుకు ఈ జిల్లాల కలెక్టర్లకు కోటి రూపాయల చొప్పున విడుదల చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రి హరీష్ రావుకు సూచించారు.
కడెం ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కులు.. కేసీఆర్ ఆశ్చర్యం
కడెం ప్రాజెక్టు కెపాసిటీ 2.95 లక్షల క్యూసెక్కులేనని,కానీ దీనికి 5 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు వచ్చిందని కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది చరిత్రలోనే కనీవినీ ఎరుగమన్నారు. ఇక్కడి ప్రజల భద్రతకు ఇరిగేషన్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారు ఇంజనీరింగ్ నిపుణులు, ఇరిగేషన్ శాఖలోని రిటైర్డ్ ఉద్యోగుల సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు.