తెలంగాణ ఎన్నికలపై కీలక అప్‌డేట్ చెప్పిన సీఈవో వికాస్ రాజ్

ఎన్నికల కోసం అవసరమై సమాచారాన్ని అందించేందుకే మీడియా సెంటర్‌ను ప్రత్యేకంగా ప్రారంభించామని చెప్పారు.

Advertisement
Update:2023-09-23 16:13 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్ కీలక అప్‌డేట్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు మరో రెండు మూడు నెలల సమయం మాత్రమే ఉన్నదని వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్కే భవన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కమిషన్ మీడియా సెంటర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ..

ఎన్నికల కోసం అవసరమై సమాచారాన్ని అందించేందుకే మీడియా సెంటర్‌ను ప్రత్యేకంగా ప్రారంభించామని చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్స్‌కు సమయం దగ్గర పడుతుండటంతో జిల్లాల్లోని అధికారులకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈవీఎంల తనిఖీ అనంతరం.. తుది ఓటర్ల జాబితా కూడా పూర్తయ్యాక.. జిల్లాల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామని తెలిపారు. తెలంగాణ ఎన్నికల కోసం రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన 20 ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు పని చేయబోతున్నట్లు వికాస్ రాజ్ చెప్పారు. ఎన్నికలకు సంబంధించి చాలా సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. వాటికి త్వరితగతిన పరిష్కరిస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే నాలుగు వేల భవనాలను ఎన్నికల నిర్వహణ కోసం గుర్తించామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో అడ్రస్ మార్పుల ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని.. వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా చేరారని చెప్పారు. యువత, మహిళా ఓటర్ల నమోదుపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు సీఈవో వికాస్ చెప్పారు.

రాష్ట్రంలో 6.99 లక్షల యువ ఓటర్లను నమోదు చేయించామని.. మహిళా ఓటర్ల సంఖ్య పెంచడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎన్నికలు పూర్తి పాదర్శకంగా జరుగుతాయని.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తామని వికాస్ రాజ్ పేర్కొన్నారు. అక్టోబర్ 3 నుంచి 5 వరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనున్నదని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News