తెలంగాణ భవన్ లో మిన్నంటిన సీఎం.. సీఎం.. నినాదాలు
హరీశ్ రావు, ఇతర నాయకులతో కేటీఆర్ సమావేశం
ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న కేటీఆర్ కు బీఆర్‌ఎస్ శ్రేణులు గ్రాండ్ గా వెల్‌కమ్ చెప్పారు. ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ వెంట సీనియర్ నాయకులు, కార్యకర్తలు భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ భవన్ బయట కార్యకర్తలు కేటీఆర్ ను తమ భుజాలపైకి ఎత్తుకొని పార్టీ ఆఫీసులోపలికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎం.. సీఎం.. నినాదాలు మిన్నంటాయి. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్నారు. భవన్ లోకి అడుగు పెట్టిన కేటీఆర్‌ను పార్టీ నాయకులు సాదరంగా స్వాగతించారు. ఈ సందర్‌భంగా సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావును కేటీఆర్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం హరీశ్ రావు సహా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏసీబీ విచారణ తీరు, తనను అడిగిన ప్రశ్నల గురించి కేటీఆర్ వివరించారు.