వలసల కోసం బీజేపీ ఎదురు చూపులు.. తెలంగాణలో పారని పాచికలు..

ఈటల రాజేందర్ చేరిక దగ్గర్నుంచీ బండి ఈ మాటలు చెబుతూనే ఉన్నారు. కానీ ఈటల మినహా ఏ ఒక్కరూ టీఆర్ఎస్‌ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేరని తేలిపోయింది.

Advertisement
Update:2022-08-28 12:38 IST

"టీఆర్ఎస్ నుంచి భారీ స్థాయిలో బీజేపీలోకి ఎమ్మెల్యేలు వలస వచ్చేస్తారు. త్వరలో తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలుంటాయి." ఇటీవల బండి సంజయ్ నమ్మకంగా చెప్పిన మాటలివి. ఈ మాటలతో బీజేపీ అధిష్టానాన్ని కూడా తెలంగాణలో ఏదో జరుగుతోందనే భ్రమల్లోకి నెట్టేశారు బండి సంజయ్. ఈటల రాజేందర్ చేరిక దగ్గర్నుంచీ బండి ఈ మాటలు చెబుతూనే ఉన్నారు. కానీ ఈటల మినహా ఏ ఒక్కరూ టీఆర్ఎస్‌ని విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేరని తేలిపోయింది. ఈ విషయం బండికి కూడా తెలుసు, కానీ ఏదో ఒక విదంగా అధిష్టానాన్ని మభ్యపెట్టడానికి, తెలంగాణలో అలజడి సృష్టించడానికి ఈ మాటలు చెబుతూ మోసబుచ్చుతున్నారు బండి.

ముందు కార్యకర్తలు, తర్వాత నాయకులు..

ఎమ్మెల్యేలు బయటకు రాకపోవడంతో ముందు చిన్నా చితకా కార్యకర్తలకు మాయ మాటలు చెప్పి కండువాలు కప్పడం మొదలుపెట్టారు బీజేపీ నేతలు. ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారు, ముందు కార్యకర్తల్ని చేర్చుకుని, వారితో ఒత్తిడి పెంచి, ఆ తర్వాత పెద్ద నాయకుల్ని బీజేపీలోకి తీసుకొస్తామని అధిష్టానానికి నమ్మబలికారు. కానీ నాయకులు రాలేదు, బీజేపీలో చేరిన కార్యకర్తలే తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ దశలో అధిష్టానం కూడా తెలంగాణ నాయకత్వంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని సంతోషపెట్టేందుకే ఎన్టీఆర్, నితిన్, మిథాలీరాజ్.. ఇలా సరికొత్త డ్రామాకు తెరతీశారు.

ఈటలతో కూడా ఉపయోగం లేదు..

ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ నేతలతో ఉన్న సంబంధాలను ఉపయోగించుకుని.. కనీసం కొంతమందినైనా ఇటువైపు తీసుకురావాలనేదీ బీజేపీ ప్లాన్. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. ఈటలను చేరికల కమిటీ కోఆర్డినేటర్‌గా నియమించినా పెద్ద నాయకులెవరూ బీజేపీ గాలానికి చిక్కడం లేదు. దీంతో ఈటలది కూడా ఫ్లాప్ షోగా మిగిలిపోయింది.

కార్యవర్గ సమావేశం కూడా అందుకేనా..?

ఇటీవల తెలంగాణలో బీజేపీ కార్యవర్గ సమావేశాలు భారీ ఎత్తున జరిగాయి. సహజంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుకోవాల్సిన మీటింగ్‌ని, ప్రతిపక్షంలో.. అందులోనూ కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలున్న తెలంగాణలో ఎందుకు పెట్టుకున్నారా అని ఆలోచించారంతా. ఆ హడావిడి చూపించి కనీసం కొంత మంది ఎమ్మెల్యేలు అయినా బీజేపీలోకి తీసుకురావాలనేది అధినాయకత్వం ఆలోచన. కానీ అక్కడా కండువాలకు పనిలేకుండా పోయింది. ఇటీవల అమిత్ షా వచ్చినా కేవలం రాజగోపాల్ రెడ్డికి కండువా కప్పారే కానీ, పెద్ద స్థాయి నాయకులెవరూ బీజేపీలోకి రాలేదు. జేపీ నడ్డా మీటింగ్ మరీ చప్పగా సాగింది. దీంతో బీజేపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. బండి సంజయ్ కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయారు. డజను మంది ఎమ్మెల్యేలొస్తారు, ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అంటూ రెచ్చిపోయిన సంజయ్, కనీసం స్థానిక ఎన్నికల్లో గెలిచిన వార్డ్ మెంబర్‌ని కూడా పార్టీలో చేర్చుకోలేకపోయారు.

Tags:    
Advertisement

Similar News