మా ఇండ్లు, ఆఫీసుల మీదికి వస్తామంటే చూస్తూ ఊరుకోం

మా 60 లక్షల మంది సైనికులు తిరగబడితే మీరు జనంలో తిరగలేరు.. కాంగ్రెస్‌ నేతలకు ఎమ్మెల్సీ కవిత అల్టిమేటం

Advertisement
Update:2025-01-22 14:05 IST

బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల ఇండ్లు, ఆఫీసుల మీదికి వస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బుధవారం ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్ద గిరిప్రదక్షిణ నిర్వహించిన ఆమె అనంతరం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ ఆఫీసులో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ 60 లక్షల మంది కార్యకర్తలున్న కుటుంబమని.. తమ కార్యకర్తలు తలచుకుంటే కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్రంలో తెరగలేరని అల్టిమేటం ఇచ్చారు. ఖబడ్దార్‌ కాంగ్రెస్‌ నాయకులారా.. జాగ్రత్త అని హెచ్చరించారు. ఇంకోసారి బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ వైపు కన్నెత్తి చూసినా ఊరుకోబోమన్నారు. రౌడీ మూకలను వేసుకొని పార్టీ ఆఫీసులపై దాడులు చేసే దరిద్రపు సంస్కృతి తమది కాదని.. విజ్ఞత, నిబద్ధతతో ప్రజల కోసం పోరాడే సంస్కృతి మతది అన్నారు.


 



మూసీ నది మురికిమయం కావడానికి కారకులెవరో ప్రజలు గుర్తించాలన్నారు. పారిశ్రామికవ్యర్థాలు మూసీలో కలుస్తుంటే రాష్ట్రాన్ని 60 ఏళ్ల పాటు పాలిచింది ఎవరని ప్రశ్నించారు. మూసీ నదిని ప్రక్షాళన చేయడానికి కేసీఆర్‌ పూనుకున్నారని, అందులో భాగంగానే 31 ఎస్టీపీలు ఏర్పాటు చేసి మురుగునీటిని శుద్ధి చేసే వ్యవస్థ తీసుకువచ్చారని తెలిపారు. మూసీ మురికికి శాశ్వత పరిష్కారం చూపించాలని కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందించారని.. కానీ కాంగ్రెస్‌ పార్టీ మూసీని ఏటీఎంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు. హైదరాబాద్‌ కు దగ్గరగా ఉన్న కొండపోచమ్మసాగర్‌ నుంచి తక్కువ ఖర్చుతో గోదావరి - మూసీ అనుసంధానం చేపట్టే అవకాశమున్నా కాంట్రాక్టర్ల కోసమే మల్లన్నసాగర్‌ కు ఆ ప్రాజెక్టును మార్చి రూ.7,500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇరిగేషన్‌ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లను బుల్డోజర్లతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చివేయిస్తుందన్నారు.

మూసీ ప్రక్షాళనకు ఒకసారి రూ.50 వేల కోట్లు, ఇంకోసారి రూ.లక్ష కోట్లు.. మరోసారి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చవుతాయని ముఖ్యమంత్రి చెప్పడం అంటే ఈ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకోవడమేనని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా డబ్బు మూటలు ఢిల్లీకి పంపేందుకు రేవంత్‌ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన యాదాద్రి పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. యాదాద్రి వైభవాన్ని ప్రభుత్వం కాపాడాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కేసీఆర్‌ ఎంతగానో కృషి చేశారని, మిషన్‌ భగీరథతో ఫ్లోరైడ్‌ భూతాన్ని పారద్రోలారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వమే ఫ్లోరైడ్‌ పారద్రోలినట్టుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా చెప్పిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఆరు దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోరైడ్‌ ప్రభావ ప్రాంతాల్లో రక్షిత నీటిని సరఫరా చేసేందుకు కూడా ప్రయత్నించలేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భిక్షమయ్య గౌడ్‌, కంచర్ల రామకృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News