బీజేపీ బస్సు యాత్రకు బ్రేకేసిన అమిత్ షా.. అసలు కారణం ఏంటో తెలుసా?

యాత్రల నిర్వహణపై రాష్ట్ర నాయకులపై సయోధ్య కుదరలేదని.. మూడు చోట్ల ఎవరెవరు నాయకత్వం వహించాలనే విషయంపై ఏకాభిప్రాయం లేదని సమాచారం.

Advertisement
Update:2023-09-18 09:13 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్రలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ఈ యాత్రలు ప్రారంభించాలని భావించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ శ్రేణులను సన్నద్దం చేయడానికి కూడా ఈ యాత్రలు ఉపయోగపడతాయని అంచనా వేశారు. అయితే కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర నాయకుల నిర్ణయంపై నీళ్లు పోసినట్లు తెలుస్తున్నది. బస్సు యాత్రల అవసరం ఇప్పుడేమీ లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26 నుంచి అక్టోబర్ 14 వరకు 19 రోజుల పాటు 119 నియోజకవర్గాలను చుట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది. అయితే ఈ యాత్రల నిర్వహణపై రాష్ట్ర నాయకులపై సయోధ్య కుదరలేదని.. మూడు చోట్ల ఎవరెవరు నాయకత్వం వహించాలనే విషయంపై ఏకాభిప్రాయం లేదని సమాచారం. ఎవరైనా ఒకరికి బాధ్యతలు ఇస్తే.. మిగిలిన వాళ్లు సహకరిస్తారా? అనే అనుమానాలు కూడా అధిష్టానానికి వచ్చాయి. కీలకమైన ఎన్నికలకు ముందు 19 రోజుల పాటు యాత్రలకే సమయం కేటాయిస్తే.. పార్టీ సంస్థాగత బలోపేతానికి ఇంకెక్కడ సమయం ఉంటుందని కూడా భావించారు.

తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అమిత్ షా.. బస్సు యాత్రలపై తన నిర్ణయం తెలియజేసినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలపై కాకుండా.. సంస్థాగతంగా పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తున్నది. బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని, ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ తరపున బరిలోకి దిగే అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పినట్లు తెలుస్తున్నది.

ముందుగా బూత్ కమిటీల పని తీరుపైనే సమీక్షలు చేయాలని.. బలహీనంగా, అచేతనంగా ఉన్న కమిటీలను పక్కన పెట్టి కొత్త కమిటీలు వేయాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది. తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా పటిష్టమైన నిర్మాణం లేని విషయంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత ఇంచార్జి సునీల్ బన్సల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముందుగా బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నాయకులకు సూచించినట్లు తెలుస్తున్నది. బస్సు యాత్రలను పక్కన పెట్టి.. ఈ విషయం పైనే ఫోకస్ చేయాలని చెప్పినట్లు సమాచారం.

గతంలో మధ్యలోనే నిలిపి వేసిన 'బూత్‌ సశక్తి అభియాన్'ను పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని.. అక్టోబర్ 2లోగా ఈ కార్యక్రమం పూర్తి కావాలని అధిష్టానం ఆదేశించింది. దీనికి సంబంధించిన కార్యచరణను కచ్చితంగా అమలు చేయాలని అమిత్ షా కూడా చెప్పినట్లు తెలుస్తున్నది. అందుకే బస్సు యాత్రలకు బ్రేక్ వేసి.. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి రాష్ట్ర నాయకత్వం సిద్ధపడుతోంది.

Tags:    
Advertisement

Similar News