బీఆర్ఎస్ అనుమానం నిజమేనా..? బెంగళూరులో రూ.42కోట్లు సీజ్

నాలుగు రోజుల్లో స్వాధీనం చేసుకున్నదానికంటే ఎక్కువ సొమ్ము.. కర్నాటకలో ఒకేరోజు బయటకు రావడం విశేషం. ఆ డబ్బు ఓ మంత్రికి చెందినదిగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఈడీ కేసు దర్యాప్తు చేస్తోంది.

Advertisement
Update:2023-10-13 11:37 IST

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పొరుగున ఉన్న తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకోసం కర్నాటక నుంచి భారీగా నగదు తరలించబోతోందంటూ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఆల్రడీ కర్నాటకలోని కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి కమీషన్లు దండుకుంటున్నారని, ఆ సొమ్ముని తెలంగాణ ఎన్నికల్లో ఖర్చుపెట్టబోతున్నారని కాంగ్రెస్ నేతలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇవి కేవలం ఆరోపణలే కావని, అందులో నిజం ఉందని ఇప్పుడు స్పష్టమవుతోంది. తాజాగా కర్నాటకలో రూ.42కోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుని లారీలో తెలంగాణకు తరలిస్తున్నట్టు గుర్తించారు.

తెలంగాణ ఎన్నికలకోసం కర్నాటకనుంచి లారీలో తరలి వస్తున్న రూ.42కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. 22 బాక్సుల్లో ఈ నగదు తరలిస్తుండగా ఐటీ అధికారుల సోదాల్లో అవి బయటపడ్డాయి. ఇంతకు ముందే రూ.8కోట్ల రూపాయలను బోర్డర్ దాటించారని, మిగిలిన 42కోట్ల రూపాయలను తాము పట్టుకున్నామని అధికారులు చెబుతున్నారు. నగదు సీజ్ చేసిన ఐటీ అధికారులు ఈ కేసుని ఈడీకి బదిలీ చేశారు.

షెడ్యూల్ విడుదలయ్యాక భారీగా నగదు పట్టివేత..

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలను విస్తృతం చేశారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. బంగారం, వెండిని కూడా సీజ్ చేస్తున్నారు.

నాలుగు రోజుల్లో పోలీసుల తనిఖీల్లో రూ.37 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. 30 కిలోల బంగారం, 350 కిలోల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల్లో స్వాధీనం చేసుకున్నదానికంటే ఎక్కువ సొమ్ము.. కర్నాటకలో ఒకేరోజు బయటకు రావడం విశేషం. ఆ డబ్బు ఓ మంత్రికి చెందినదిగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఈడీ కేసు దర్యాప్తు చేస్తోంది. 

Tags:    
Advertisement

Similar News