ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ ను అందుకే తప్పించారా?
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వానికి ముంబై ఫ్రాంచైజీ తెరదించింది. కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించడానికి అసలు కారణమేంటో గవాస్కర్ బయటపెట్టారు
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వానికి ముంబై ఫ్రాంచైజీ తెరదించింది. కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తప్పించడానికి అసలు కారణమేంటో గవాస్కర్ బయటపెట్టారు...
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ, రోహిత్ శర్మ అంటే ముంబై ఇండియన్స్ అనుకొనే రోజులు పోయాయి. ముంబై కెప్టెన్ గా 10 సీజన్లలో 5 టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ నాయకత్వానికి ఫ్రాంచైజీ యాజమాన్యం తెరదించింది.
రోహిత్ నాయకత్వానికి వీడ్కోలు పలుకుతూ నయా కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాకు స్వాగతం పలికింది.
రోహిత్ ను ఒప్పించారా? లేక తప్పించారా?
ముంబై ఇండియన్స్ తిరుగులేని నాయకుడిగా దశాబ్దకాలంపాటు ఓ వెలుగు వెలిగిన రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా చేతికి పగ్గాలు ఇస్తున్నట్లు ముంబై ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
గుజరాత్ ఫ్రాంచైజీని వీడి హార్థిక్ పాండ్యా ముంబైగూటిలోకి రావడంతోనే కెప్టెన్ గా రోహిత్ శర్మకు అల్విదా చెప్పడం ఖాయమని కొద్దివారాల క్రితమే తేలిపోయింది.
అయితే..రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యా చేతికి జట్టు పగ్గాలు అప్పజెప్పినట్లుగా ముంబై ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటికే పలు రకాలుగా బయటకు సంకేతాలను పంపింది.
అదీ చాలదన్నట్లుగా..పది సీజన్లపాటు ముంబైని అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిపిన సారథిగా రోహిత్ శర్మకు నీరాజనాలు పలుకుతూ ఓ సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టడంతో రోహిత్ ఇక ముంబై ఇండియన్స్ కి ఏమాత్రం కెప్టెన్ కాదని తేలిపోయింది.
గత రెండు సీజన్లుగా ముంబై వెలవెల...
2013 నుంచి ముంబై ఫ్రాంచైజికి తన కెప్టెన్సీ ప్రతిభతో ఐదుటైటిల్స్ అందించిన రోహిత్..గత రెండు సీజన్లుగా దారుణంగా విఫలమయ్యాడు. 2022 సీజన్లో పది జట్ల లీగ్ లో 9వ స్థానానికి పడిపోయిన ముంబై 2023 సీజన్లో 10వ స్ధానానికి దిగజారిపోడాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం తీవ్రంగా పరిగణించింది. ముంబై మరోసారి విజేతగా నిలవాలంటే నాయకత్వమార్పు అనివార్యమని భావించి..గుజరాత్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాను తనవైపునకు రప్పించుకొంది.
దీనికితోడు ముంబైజట్టు కెప్టెన్సీ పగ్గాలు తన చేతికి ఇస్తేనే వస్తానని హార్థిక్ పాండ్యా సైతం షరతు విధించడంతో రోహిత్ ను తప్పించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అయితే..ఇటీవలే ముగిసిన2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భారత్ కు గొప్ప నాయకత్వాన్ని అందించడం ద్వారా నిస్వార్థమైన కెప్టెన్ గా ప్రశంసలు అందుకొన్న రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ముంబై ఫ్రాంచైజీ తప్పించడం ద్వారా గొప్ప సాహసమే చేసింది.
రోహిత్ ను నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలిగేలా ఒప్పించారా? లేక తప్పించారా? అన్న విషయమై క్రికెట్ విమర్శకులు, విశ్లేషకులు, పండితులు ఎవరికి తోచినది వారు చెబుతున్నారు.
సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే....!
గత దశాబ్దకాలంలో ముంబైని గొప్ప ఐపీఎల్ ఫ్రాంచైజీగా, అత్యంత విజయవంతమైన జట్టుగా నిలపడంలో ఆటగాళ్లతో పాటు నాయకుడిగా రోహిత్ శర్మ పాత్ర ఎంతో ఉందని, రోహిత్ లేని ముంబై ఇండియన్స్ ను ఊహించలేమని..అలాంటి రోహిత్ ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించడానికి తగిన కారణమే ఉందంటూ భారత మాజీ కెప్టెన్, విఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ సెలవిచ్చారు.
భారత టెస్టు, వన్డే, టీ-20 ఫార్మాట్లలో నాయకుడిగా వ్యవహరించడం ద్వారా రోహిత్ తీవ్రంగా అలసిపోయాడని, కెప్టెన్ గా అలసిపోయినవారి చేతిలో జట్టు పగ్గాలు ఉండటం అంత మంచిదికాదని ఫ్రాంచైజీ యాజమాన్యం భావించి ఉండవచ్చునని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
గత రెండు సీజన్లలో ముంబై లాంటి మేటిజట్టు లీగ్ టేబుల్ అఖరి రెండుస్థానాలలో నిలవడం ఫ్రాంచైజీ కంటిమీద కునుకు లేకుండా చేసి ఉండవచ్చునని చెప్పారు.
రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం వల్ల కలిగే లాభనష్టాల గురించి ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చర్చించుకోవచ్చునని, అయితే ..యాజమాన్యం మాత్రం తమకు మేలు జరగాలన్న భావనతోనే నాయకత్వ మార్పు తీసుకొని ఉండవచ్చునని చెప్పారు. నాయకుడిగా రోహిత్ అలసటకు గురికావడమే అసలు కారణమని తేల్చి చెప్పారు.
రోహిత్ తో పోల్చిచూస్తే హార్థిక్ పాండ్యా యువరక్తంతో, సరికొత్త ఆలోచనలు, వ్యూహాలతో ఉరకలేసే నాయకుడని కొనియాడారు. 2024 సీజన్లో నయా కెప్టెన్ హార్థిక్ పాండ్యా తిరిగి ముంబైని అగ్రస్థానంలో నిలపాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ అందించిన సేవలు, నెలకొల్పిన రికార్డులు అపూర్వమని, అభిమానులకు కలకాలం గుర్తుండిపోతాయని గవాస్కర్ కొనియాడారు.
రోహిత్ శర్మ కెప్టెన్ గా 2013లో తొలి ఐపీఎల్ టైటిల్ అందుకొన్న ముంబై ఇండియన్స్ ఆ తరువాత మరోనాలుగుసార్లు విజేతగా నిలిచింది. 2015, 2017, 2019 and 2020 సీజన్లో ఐపీఎల్ చాంపియన్ గా నిలిచిన ముంబై గత సీజన్లో ప్లే-ఆఫ్ రౌండ్స్ కు అర్హత సాధించినా సఫలం కాలేకపోయింది.