ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా రికార్డు ఛేజింగ్
ఇంగ్లిష్ సూపర్ సెంచరీ... ఆస్ట్రేలియా అద్భుత విజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. లాహోర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 351 రన్స్ చేసింది. టోర్నీలో చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కాగా... ఈ కొండంత లక్ష్యాన్ని కంగారులు 5 వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలో ఛేధించారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ (120 నాటౌట్: 86 బాల్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకంతో దంచికొట్టాడు. 77 బాల్స్ లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. అలెక్స్ కేరీ (69), మాథ్యూ షార్ట్ (63) హాఫ్ సెంచరీలు సాధించారు. లబుషేన్ (47) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అంతకుముందు ట్రావిస్ హెడ్(6), స్టీవ్ స్మిత్ (5) సింగిల్ డిజిట్‌కే ఔట్ కావడంతో ఆసీస్ 27 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో షార్ట్, లబుషేన్ మరో వికెట్ పడకుండా కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరగా.. ఇంగ్లిష్, కేరీ బాధ్యత తీసుకుని జట్టును విజయపథంలో నడిపించారు. ముఖ్యంగా జోష్ ఇంగ్లిష్ అద్భుతమైన షాట్స్ ఆడుతూ.. ఆస్ట్రేలియా జట్టులో జోష్ నింపి చరిత్రాత్మక విజయం అందించాడు.చివర్లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ ( 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.