బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టిన ఒకే ఒక్కడు
ఇండియా టార్గెట్ 229 పరుగులు
35 పరుగులకే 5 వికెట్లు.. ఇక బంగ్లాదేశ్ పని అయిపోయింది.. వంద రన్స్ లోపే ప్యాక్ అయిపోతుంది అని అందరూ లెక్కలు వేసుకున్నారు. జాకేర్ అలీతో కలిసి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ను తౌహిద్ హృదయ్ చక్కదిద్దాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఒక్కో పరుగు యాడ్ చేస్తూ పోయాడు. 114 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో వంద పరుగులు చేసి సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో జరుగుతోన్న మ్యాచ్‌లో ఈ బంగ్లాదేశీ బ్యాటర్ అందరి హృదయాలను కొల్లగొట్టాడు. ఆరో వికెట్ కు జారీర్ అలీతో కలిసి ఏకంగా 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దుబయి వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేవలం 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంతో బంగ్లా కెప్టెన్ నిర్ణయాన్ని అందరూ తప్పుబట్టారు. క్రీజ్‌లోకి వస్తూనే ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన లైఫ్‌తో జాకీర్ మరో తప్పు చేయకుండా జాగ్రత్త పడ్డాడు. 114 బంతులు ఆడి నాలుగు ఫోర్లతో 68 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రషీద్ హొస్సైన్ 12 బంతుల్లోనే రెండు సిక్సులు, ఫోర్‌తో 18 పరుగులు చేసి రాణా బౌలింగ్‌లో ఔటయ్యాడు. సెంచరీ హీరో హృదయ్ మరో రెండు బంతుల్లో ఇన్నింగ్స్ ముగుస్తుంది అనగా వంద పరుగుల వద్ద రాణా బౌలింగ్‌లో షమీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మహ్మద్ షమీ టీమ్‌లోకి తిరిగి వస్తూనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. 10 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. హర్షిత్ రాణాకు మూడు. అక్షర్ పటేల్ కు రెండు వికెట్లు దక్కాయి. బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇండియాకు 229 పరుగుల టార్గెట్ ఇచ్చింది.