ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత సీనియర్లపై కఠిన నిర్ణయాలే
ఈ టోర్నమెంట్‌తో సీనియర్ల భవిష్యత్తు కూడా తేలిపోనున్నది. ఏ స్థానాల్లో మార్పులు చేయాలనేది తెలుస్తుందన్న అనిల్ కుంబ్లే
టీమిండియా జట్టు భవిష్యత్తు కోసం మార్పులు చేసే క్రమంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ప్రధాన కోచ్ గంభీర్ ముందు కఠిన సవాళ్లు ఎదురవుతాయని వ్యాఖ్యానించాడు.సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, షమీ విషయంలో కఠిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని.. అంతా సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యత మాత్రం గంభీర్‌పైనే ఉందన్నాడు.
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఇది చాలా కీలకమైన టోర్నీ. ఎందుకంటే దీనితర్వాత చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నది. స్టార్ ప్లేయర్ల వారసత్వాన్ని కొనసాగించాలి. అయితే ఇది కోచ్‌గా ఆయన బాధ్యత. అందుకే ఈ టోర్నమెంట్‌తో సీనియర్ల భవిష్యత్తు కూడా తేలిపోనున్నది. ఏ స్థానాల్లో మార్పులు చేయాలనేది తెలుస్తుంది. గెలిచినా.. ఓడినా మార్పులు మాత్రం ఖాయం. ఇది ముగిసిన తర్వాత వన్డే ప్రపంచకప్2027 మెగా టోర్నీకి సన్నాహాలు మొదలుపెట్టాలి. అలా చేయాలంటే యువకులతో కూడిన స్క్వాడ్‌ను సిద్ధం చేసుకోవాలి. అందులో ప్రతి ఒక్కరికీ కనీసం 20 మ్యాచుల్లో ఆడే అవకాశం కల్పించాలి. అప్పుడే పరిస్థితులకు ఆటగాళ్లు అలవాటు పడటానికి ఆస్కారం ఉంటుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం సీనియర్లను కొనసాగించాలా? యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలా అనేది కోచ్, మేనేజ్‌మెంట్ నిర్ణయించాలి. ఈ విషయంలో గంభీర్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. టీ20 ల్లో ఇప్పటికైనా సన్నద్ధత బాగున్నది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో జట్టు అద్భుతంగా రాణిస్తున్నది. వచ్చే ఏడాది పొట్టి కప్ జరగనున్నది. వన్డే ప్రపంచకప్‌కు రెండేళ్ల సమయం ఉన్నది. ఆలోగా యువ క్రికెటర్లను సిద్ధం చేయవచ్చు. నిలకడగా రన్స్ చేసే క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వాలని కుంబ్లే వెల్లడించారు.